Begin typing your search above and press return to search.

పోలవరం మీద కేంద్రం కన్ఫ్యూజన్ చేస్తోందా...?

By:  Tupaki Desk   |   27 March 2023 6:05 PM GMT
పోలవరం మీద  కేంద్రం  కన్ఫ్యూజన్ చేస్తోందా...?
X
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రంలోని ప్రభుత్వం తీరు మీద జనాలతో పాటు అందరిలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతూనే ఉంది. జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పి దాన్ని ఏమీ కాకుండా చేస్తున్నారు అన్న బాధ ఉంది. షెడ్యూల్ ప్రకారం ఎపుడో పూర్తి కావాల్సిన పోలవరం ఈ రోజుకూ పడుతూ లేస్తూ ఉంది.

వీటికి తోడు కేంద్రం ఈ ప్రాజెక్ట్ మీద ఎంత నాన్ సీరియస్ గా ఉంది అన్నది కూడా ప్రకటనలను బట్టే తెలుస్తోంది అంటున్నారు. తడవకో కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి తనకు తోచిన అందిన లెక్కలు చెబుతున్నారు. దీంతో మంత్రి మంత్రికీ లెక్కలు మారుతాయా. అసలు ఏమి జరుగుతోంది. పోలవరం విషయంలో కేంద్రం ఏమి చెబుతోంది అని అంతా మండుతున్నారు.

రెండు రోజుల క్రితం పోలవరం ఎత్తు గురించి ప్రహ్లాద్ పటేల్ అనే ఒక సహాయ మంత్రి గారు వైసీపీ ఎంపీ భీశెట్టి సత్యవతి అడిగిన దానికి బదులిస్తూ ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చేశారు. ఇది మొదటి దశ అని కూడా చెప్పుకొచ్చారు. అదే టైం లో ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ కూడా మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తులోనే నీటిని రిజర్వ్ చేస్తామని చెప్పుకొచ్చారు.

అయితే మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయితే రెండవ దశలో 45 మీటర్ల దాకా నిర్మాణం సాగుతుందని అన్నారు. ఇపుడు కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రిగా మరొకాయన బిశ్వేశ్వర్ తుడు అయితే పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు 45.15 మీటర్లు అని అంటున్నరు. అది కూడా 1980 గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం అంటూ చెప్పుకొచ్చారు.

అంతే కాదు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎత్తు తగ్గించినట్లుగా తమకు ఎలాంటి సమాచారం రాష్ట్రం వైపు నుంచి రాలేదని చెబుతున్నారు. ఈ ప్రశ్నను టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కనక మేడల రవీంద్రకుమార్ అడిగినపుడు కేంద్ర మంత్రి ఇచ్చిన జవాబు.

మరో వైపు చూస్తే పోలవరం అంచనాల విషయంలో కేంద్రం రెండు రకాలుగా జవాబు చెబుతోంది. తమకు అలా సవరించిన అంచనాలు వచ్చాయని అంటోంది. 2017-28లలో సవరించిన అంచనాలు అంటూ 47.725 కోట్ల రూపాయలుగా వచ్చాయని, ఇక రెండవ సవరించిన అంచనా వ్యయం చూస్తే 2019లో 55,548 కోట్ల రూపాయలుగా వచ్చాయని వెల్లడించింది.

అయితే ఈ సవరించిన అంచనాలను కేంద్ర జలశక్తి సాంకేతిక సలహా కమిటీ ఆమోదించింది అని చెప్పడం విశేషం. ఇక 2014లో పోలవరం ఎస్టిమేషన్ కాస్ట్ చూస్తే 29,027 కోటుగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్ట్ కి కేంద్రం ఇచ్చిన మొత్తం 13,463 కోట్లుగా ఆయన వివరించారు.

ఇలా కేంద్ర మంత్రులు చెబుతున్న విషయాలు పోలవరం విషయంలో గందరగోళంలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ పోలవరం ఎత్తు ఎంత, దానికి సంబంధించి సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించిందా. ఒకవేళ ఆమోదిస్తే 55 వేల కోట్లు ఎక్కడ, కేంద్రం తొమ్మిదేళ్ళలో ఇచ్చిన 13 వేల కోట్లు ఎక్కడ. నాలుగవ వంతు కంటే తక్కువగా ఇప్పటిదాకా ఇస్తే మరి పోలవరం ప్రాజెక్ట్ ఎపుడు పూర్తి అవుతుంది.

ఏ ఏటికి ఆ ఏడు అంచనా వ్యయం పెరిగిపోతున్న వేళ జాతీయ ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర మంత్రులు ఇద్దరూ రెండు సభలలో ఇద్దరు ఎంపీలకు వేరు వేరుగా చెబుతూ ఇంతలా కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తున్నారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని లైట్ తీసుకుంటున్నారా అన్న చర్చ కూడా వస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.