Begin typing your search above and press return to search.

ట్రిపుల్ త‌లాఖ్‌ పై కేంద్రం గ‌ట్టి జ‌వాబిచ్చింది

By:  Tupaki Desk   |   7 Oct 2016 4:07 PM GMT
ట్రిపుల్ త‌లాఖ్‌ పై కేంద్రం గ‌ట్టి జ‌వాబిచ్చింది
X
ముస్లిం మైనార్టీల్లో తీవ్ర వివాదాస్ప‌ద అంశమైన త్రిపుల్ త‌లాఖ్‌పై కేంద్ర ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని స్ప‌ష్టంగా తేల్చిచెప్పింది. భార‌త్ లాంటి లౌకిక దేశంలో ట్రిపుల్ త‌లాఖ్‌కు తావులేద‌ని ఇవాళ సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఇస్లాం చ‌ట్టం ప్ర‌కారం పురుషులు త‌లాఖ్ అని మూడుసార్లు అంటే విడాకులు మంజూరైన‌ట్లే. అయితే వివ‌క్ష చూపుతున్న ఇలాంటి చ‌ట్టాల‌ను ముస్లిం మ‌హిళ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. బ‌హుభార్య‌త్వం, ఏక‌ప‌క్ష విడాకులు, బాల్య వివాహాల‌ను అరిక‌ట్ట‌డానికి ఓ క‌ఠిన చ‌ట్టం తీసుకురావాల‌ని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుతోనే ముస్లిం మ‌త పెద్ద‌లు పెళ్లి - విడాకులు - వార‌స‌త్వంలాంటి విష‌యాల్లో త‌మ సొంత సివిల్ కోడ్‌ ను పాటిస్తున్నారు. దీంతో వారి కుటుంబ విష‌యాల్లో చిచ్చులు రేగాయి.

ఈ క్ర‌మంలోనే భార‌తీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ (బీఎంఎంఏ) సహ సంస్థాపకురాలు నూర్జహాన్‌ సాఫియా నియాజ్ ఈ విష‌యంలో సుప్రీంకోర్టులో కేసు వేశారు. దేశ పౌరులుగా తమను కోర్టు గడప తొక్కకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆమె స్ప‌ష్టం చేశారు. 'ఖురాన్‌ లో ముస్లిం మహిళలకు అనేక హక్కులనిచ్చారు. కానీ ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు సభ్యుల్లో వేళ్లూనుకున్న పితృస్వామ్యం మూలంగా మహిళలకు ఎలాంటి హక్కులూ లభ్యం కాకుండా వారిని అణచివేస్తున్నారు' అని ఆమె అన్నారు. బోర్డులోని పురుష‌ సభ్యుల మొండివైఖరితో విసుగు చెందామనీ, అందుకే కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందనీ ఆమె చెప్పారు. ఈ విష‌యాల్లో ఎంత‌వ‌ర‌కు కోర్టులు జోక్యం చేసుకోగ‌ల‌వ‌న్న‌దానిపై సుప్రీంకోర్టు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డి అందులో భాగంగానే దీనిపై ప్ర‌భుత్వ వివ‌ర‌ణ కోరింది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇస్తూ కోర్టు జోక్యం ముస్లింల ప్రాథ‌మిక హ‌క్కుల భంగం క‌లిగించిన‌ట్లు అవుతుందా అన్న విష‌యంపై కోర్టు ప్ర‌భుత్వ అభిప్రాయం తీసుకుంది. భార‌త్ లాంటి లౌకిక దేశంలో ట్రిపుల్ త‌లాఖ్‌ కు తావులేద‌ని కేంద్రం తెలిపింది. అయితే కేంద్రం తెలిపిన ఈ అభిప్రాయంపై మైనార్టీల అభిప్రాయాల‌ను కేంద్రం గౌర‌వించిందా లేదా దెబ్బ‌తీసిందా అనే కోణంలో ఎలాంటి స్పంద‌న‌లు వ‌స్తాయో వేచి చూడాల‌ని బీజేపీ వ‌ర్గాలు అంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/