Begin typing your search above and press return to search.

వన్ నేషన్-వన్ రేషన్: పేదల కడుపు నింపడమే!

By:  Tupaki Desk   |   14 May 2020 11:30 PM GMT
వన్ నేషన్-వన్ రేషన్: పేదల కడుపు నింపడమే!
X
ఆకలి.. అది రాజు పేద తేడా చూడదు. ఈ కరోనా టైంలో ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంది. వలస కూలీల వెతలు చూసి కన్నీళ్లు వస్తున్నాయి. వందల కిలోమీటర్లు కాలినడకన ఆకలి దప్పికలతో వెళుతున్న వారి నడక చూస్తే నిజంగా చలించకమానరు.

వలస కూలీలు దేశానికి అత్యవసరం.. వారు లేకుంటే పనులు నడవవు. అయితే ఉత్తరాది కూలీలు దక్షిణాదికి వస్తున్నారు. మహానగరాల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో వారికి రేషన్ కార్డులున్నాయి. వారు బతుకుదెరువు కోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లోకి తరలిపోతున్నారు.. మరి వారికి ఉచిత బియ్యం ఎలా? ఎలా అందించాలి. వారి ఆకలి బాధ ఎలా తీర్చాలి.

ఆ ఆలోచనల్లోంచి వచ్చిందే మోడీ ‘వన్ నేషన్-వన్ రేషన్’ పథకం.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ‘ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు’ విధానాన్ని ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర సర్కార్ రెడీ అవుతోంది. ఈ పథకం వలస కూలీలు, పేదలు, పనుల కోసం దేశంలోని ఎక్కడికైనా వెళ్లేవారికి గొప్పవరం అని చెప్పవచ్చు.

ఈ పథకంలో దేశవ్యాప్తంగా ఎక్కడైనా లబ్ధిదారులు ఏ రేషన్ షాపు నుంచైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. దేశ ప్రజల రేషన్ డేటా అంతా ఆన్ లైన్ చేయబోతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయిన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఈ ఆగస్టు నుంచి అమలు చేయబోతున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం అమల్లోకి వస్తే రేషన్ దుకాణాల్లో అక్రమాలు తగ్గుముఖం పడుతాయని.. వలస కార్మికులు, కూలీలు తదితరులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని మోడీ సర్కార్ భావిస్తోంది.

రేషన్ కార్డు ద్వారా ఈ కరోనా టైంలో ఉచితంగా కార్డుదారులందరికీ ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు ఇస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికి ఇవి అందడం లేదు. ఇప్పుడు ఆగస్టు నుంచి ఈ పథకం ప్రారంభిస్తే దేశవ్యాప్తంగా ఉన్న వలస కూలీలు, పేదలకు గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డులున్నాయి. దేశంలోని 80 శాతం పేదలకు దీని ద్వారా లబ్ధి చేకూరనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.