Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టుకే కేంద్రం ఆర్డ‌ర్ వేసిందే!

By:  Tupaki Desk   |   14 Sep 2017 4:36 PM GMT
సుప్రీంకోర్టుకే కేంద్రం ఆర్డ‌ర్ వేసిందే!
X
తొలిసారిగా కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును అల‌ర్ట్ చేసింది. ఇంకా చెప్పాలంటే..గ‌ట్టిగా త‌న వాద‌న వినిపించింది. మ‌య‌న్మార్ త‌న్ని త‌రిమేస్తున్న రోహింగ్యా ముస్లిం తెగ‌ల‌తో దేశానికి ముప్పు అని, వాళ్ల విష‌యంలో జోక్యం చేసుకోకూడ‌ద‌ని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. వాళ్ల‌ను ప్ర‌పంచంలోనే క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాదులు అయిన ఇస్లామిక్ స్టేట్ వాడుకొనే ప్ర‌మాదం ఉంద‌ని త‌న అఫిడ‌విట్‌ లో కేంద్రం స్ప‌ష్టం చేసింది.

దేశ భ‌ద్ర‌త దృష్ట్యా వాళ్ల‌ను ఇక్క‌డి నుంచి పంపించేయాల్సిందేన‌ని స్ప‌ష్టంచేసింది. కొంద‌రు రోహింగ్యాల‌కు ఉగ్ర‌వాదుల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని, ఇప్ప‌టికే వాళ్లు ఢిల్లీ-జ‌మ్ము- హైద‌రాబాద్‌- మేవాట్‌ ల‌లో క్రియాశీల‌కంగా ఉన్న‌ట్లు ఇంటెలిజెన్స్ స‌మాచారం ఇచ్చింద‌ని కేంద్రం కోర్టుకు తెలిపింది. స‌మ‌గ్ర స‌మాచారంతోనే రోహింగ్యా శ‌ర‌ణార్థుల‌ను దేశం నుంచి బ‌హిష్కిరించాల‌ని నిర్ణ‌యించామ‌ని, ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యంతో సుప్రీంకోర్టు జోక్యం స‌రికాద‌ని కేంద్రం చెప్పింది. రోహింగ్యా శ‌ర‌ణార్థులు కొంద‌రు వేసిన పిల్‌ పై ప్ర‌భుత్వం అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌నర్ల త‌ర‌ఫున ప్ర‌శాంత్ భూష‌ణ్ కేసు వాదిస్తున్నారు. దీనిపై స్పందించాల్సిందిగా గ‌త వారం కోర్టు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. రోహింగ్యాల‌ను దేశంలోకి అనుమతించ‌డం వ‌ల్ల భార‌త పౌరుల ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ఉల్లంఘించ‌డంతోపాటు వాళ్ల భ‌ద్ర‌త‌కు కూడా ముప్పు వాటిల్లుంద‌ని కేంద్రం స్ప‌ష్టంగా పేర్కొంది.

అంతేకాదు రోహింగ్యాల‌కు పాకిస్థాన్‌ - బంగ్లాదేశ్‌ ల‌లోని ఉగ్ర‌వాదుల‌తో సంబంధాలు ఉన్న‌ట్లు కూడా త‌మ ద‌గ్గ‌ర స్ప‌ష్ట‌మైన స‌మాచారం ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. మ‌తప‌ర‌మైన హింస‌కు కూడా వీళ్లు పాల్ప‌డే ప్ర‌మాదం ఉన్న‌ట్లు చెప్పింది. దేశ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా రోహింగ్యాల‌ను దేశం నుంచి పంపించేయాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. ఇక్క‌డ ఉండే బౌద్ధుల‌పై దాడులకు పాల్ప‌డుతూ.. మ‌య‌న్మార్‌కు వ్య‌తిరేకంగా చేసే ఆందోళ‌న‌ల వ‌ల్ల ఈశాన్య రాష్ట్రాలు మ‌రింత క‌ల్లోలంగా మారే ప్ర‌మాదం ఉన్న‌ట్లు కూడా ప్ర‌భుత్వం కోర్టుకు తెలిపింది. అక్ర‌మంగా దేశంలోకి చొర‌బ‌డిన ఇలాంటి వాళ్ల‌కు అన్ని వ‌స‌తులు క‌ల్పిస్తే అది ఇక్క‌డి పౌరుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌ని స్ప‌ష్టంచేసింది.