Begin typing your search above and press return to search.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా షాక్!

By:  Tupaki Desk   |   23 April 2020 3:30 PM GMT
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా షాక్!
X
దేశంలో కరోనా మహమ్మారి విజృంభన - లాక్‌ డౌన్ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు - పెన్షనర్లకు డియర్ ‌నెస్ అలవెన్స్ - డియర్ ‌నెస్ రిలీఫ్ పెంచకూడదనే నిర్ణయానికి వచ్చింది. గత నెలలో ప్రకటించిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెరిగిన డిఎ పంపిణీని కేంద్ర ప్రభుత్వం గురువారం నిలిపివేసింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాని ఆర్ధికవ్యవస్థపై ఒత్తిడి ఉన్నందున తదుపరి రెండు పెంపులను స్తంభింపచేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.

జనవరి ఒకటి నుంచి పెండింగ్‌ లో ఉన్న మొత్తాన్ని కూడా చెల్లించ కూడదనే నిర్ణయానికి వచ్చింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం.. 2021 జులై వరకూ డీఏ - డీఆర్ పెరగదు. కాగా, కరోనా నివారణ చర్యల్లో భాగంగా మార్చి 24 నుంచి లాక్‌ డౌన్ కొనసాగుతోంది. ఆ తర్వాత మరోసారి దానిని మే 3వ తేదీ వరకు పొడిగించింది కేంద్రం - దీంతో దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలూ మూతపడ్డాయి. ఆర్థిక వనరులు మొత్తం దెబ్బతిన్నాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆర్ధిక వ్యవస్థ కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని అంచనాలున్నాయి. ఈ తరుణంలో డీఏ పెంచరాదని నిర్ణయం తీసుకుంది కేంద్రం.

దీనితో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు షాక్‌ తగిలినట్టు అయ్యింది. జనవరి 1 - 2020 నుండి రావాల్సిన డీఏ పెంపును ప్రభుత్వం చెల్లించదు అలాగే , వచ్చే ఏడాది జూలై వరకు రేట్లు అలాగే ఉంటాయి అని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ తెలిపింది. జనవరి 1 - 2020 నుండి జూన్ 30 - 2021 వరకు ఎటువంటి బకాయిలు చెల్లించబోమని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు తమ ఉద్యోగుల జీతాలను తగ్గించిన సంగతి తెలిసిందే.