Begin typing your search above and press return to search.

కేంద్రం సంచలనం.. యాత్రికులు.. పర్యాటకులు కశ్మీరాన్ని తక్షణం వదిలేయండి

By:  Tupaki Desk   |   3 Aug 2019 4:59 AM GMT
కేంద్రం సంచలనం.. యాత్రికులు.. పర్యాటకులు కశ్మీరాన్ని తక్షణం వదిలేయండి
X
ఊహించని రీతిలో కేంద్రంలోని మోడీ సర్కారు సంచలన ప్రకటన చేసింది. గడిచిన వారంగా కశ్మీర్ కు సంబంధించి మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకోనుందన్న అంచనాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. ఊహలకుఏ మాత్రం అందని రీతిలో శుక్రవారం కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల మధ్య వరకు సాగాల్సిన అమర్ నాథ్ యాత్రను తక్షణం నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించటమే కాదు.. అమర్ నాథ్ యాత్రికులతో పాటు.. ఇతర పర్యాటకులు తక్షణమే కశ్మీరాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని కోరింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఉగ్రదాడికి పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సూచన మేరకు తామీ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని పేర్కొన్నారు.

దీనికి తగ్గట్లే అమర్ నాథ్ యాత్ర మార్గంలో పాకిస్తాన్ లో తయారైన మందుపాతర.. అమెరికా తయారీ స్నైపర్ రైఫిల్ లభించటం గమనార్హం. భారీ ఎత్తున జరిగే అవకాశం ఉన్న పాక్ ఉగ్రదాడిని బలంగా తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొంది. యాత్ర మార్గంలో మందుపాతర.. రైఫిల్ లభించటంతో కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అమర్ నాథ్ యాత్రపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న కచ్ఛితమైన సమాచారం ఉందన్నారు.

కేంద్రం నుంచి అనూహ్య ప్రకటన విడుదలైన నేపథ్యంలో.. కశ్మీర్ విషయంలో తీవ్రమైన నిర్ణయం దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి తగ్గట్లే కశ్మీర్ వ్యాలీలోని రాజకీయ పార్టీలన్ని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తగ్గట్లే కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.. గతంలో బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఫ్తీ మెహబూబా స్పందిస్తూ.. కశ్మీర్ ప్రజల కన్నా.. ఇక్కడ భూభాగమే కేంద్రానికి ఎక్కువన్న విషయం తేలిపోయినట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా.. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెనుసంచలనంగా మారిందని చెప్పక తప్పదు. ఇలా.. ఒక్కసారిగా అందరిని వెళ్లిపోవాలన్న ప్రకటన చేస్తే.. రైల్వేస్టేషన్లు.. ఎయిర్ పోర్టులు కిక్కిరిపోవా? ఇలాంటప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే ఏమవుతుందన్న సందేహాన్ని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించటం గమనార్హం. కేంద్రం సంచలన నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు.. యాత్రికులు తమ సొంతూళ్లకు వెళ్లేలా కేంద్రం తగినన్ని ఏర్పాట్లు చేయకుంటుందా ఉంటుందా?