Begin typing your search above and press return to search.

కీలక నిర్ణయాన్ని ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం

By:  Tupaki Desk   |   7 Jan 2022 4:27 AM GMT
కీలక నిర్ణయాన్ని ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
X
కొత్త సంవత్సరంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ నేతలకు తీపి కబురును అందించింది. గడిచిన కొంతకాలంగా తాము చేస్తున్న డిమాండ్ కు తగ్గట్లుగా.. ఈసీ నుంచి వెలువడిన తాజా ప్రకటన.. నేతలకు సంతోషాన్ని పంచటం ఖాయం. ఇంతకూ ఆ తీపి కబురు ఏమంటే.. లోక్ సభ.. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పెంచుతూ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. మరో రెండు నెలల్లో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం వెలువరించిన ప్రకటన రాజకీయ వర్గాలకు మరింత రిలీఫ్ ను ఇవ్వటం ఖాయం.

ఇప్పటివరకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠంగా రూ.70 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండేది. అదే సమయంలో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు రూ.28లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. ఇక.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని లోక్ సభ స్థానాలకు పోటీ చేసే వారు రూ.54 లక్షలు.. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే వారు రూ.20 లక్షలు ఖర్చు చేసే వీలుంది.

తాజాగా ఈ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం.. లోక్ సభ అభ్యర్థులు రూ.70 లక్షల నుంచి రూ.95 లక్షలకు ఖర్చు పెంచుకోవటానికి వెసులుబాటు లభించింది. అదే సమయంలో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే వారు తమ ఖర్చును రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో కేంద్ర పాలిత ప్రాంతాల్లోని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఖర్చును రూ.54 లక్షల నుంచి రూ.75 లక్షలకు ఖర్చు చేసుకోవటానికి అవకాశం ఉంది. అదే విధంగా అసెంబ్లీఅభ్యర్థులకు ఉన్న వ్యయ పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.28 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

గడిచిన కొంతకాలంగా ఎన్నికల వ్యయాన్ని వాస్తవిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని పెంచాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంగం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చేసిన సూచనల ఆధారంగా తాజాగా ఎన్నికల ఖర్చునుపెంచుతూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం రేటును దృష్టిలో ఉంచుకొని తాజా పరిమితిని నిర్ణయించింది. మరికొద్ది రోజుల్లో ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్) కు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. ఈ సమయంలోనే.. ఎన్నికల ఖర్చు పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.