Begin typing your search above and press return to search.

కరోనాతో ఇంట్లో మరణించినా పరిహారం : కేంద్రం

By:  Tupaki Desk   |   25 Sep 2021 8:30 AM GMT
కరోనాతో ఇంట్లో మరణించినా పరిహారం : కేంద్రం
X
కరోనా వైరస్ బారినపడి ఇంట్లోనే మరణించినా పరిహారం అందించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. అయితే, బాధిత వ్యక్తి కరోనాతో మరణించినట్టు వైద్యుడి ధ్రువీకరణ పత్రం అవసరమని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపింది. సాధారణంగా కరోనా సోకి నిర్ధారణ అయిన 25 రోజులలోపే 95 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. నిర్ధారణ అయిన తేదీ నుంచి నెల రోజుల్లోపు సంభవించే మరణాలను పరిహారం కోసం పరిగణనలోకి తీసుకోనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.

అలాగే, కొన్ని సందర్భాల్లో నెల రోజులు దాటిన తర్వాత కూడా కరోనా కారణంగానే మరణిస్తున్నారు. ఇలాంటి మరణాల్లో వైద్యుడి ధ్రువీకరణ పత్రం ఉంటే వాటికి కూడా పరిహారం ఇవ్వాలని సూచించింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కేంద్రం ఇది వరకే నిర్ణయించగా తాజాగా, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. కేంద్రం పంపిన మార్గదర్శకాలపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ.. ఇవి ప్రాథమిక మార్గదర్శకాలేనని, పూర్తిస్థాయి మార్గదర్శకాలు అందిన తర్వాతే పరిహారంపై దృష్టిసారిస్తామని స్పష్టం చేసింది.

కరోనా వల్ల దేశంలో ఇప్పటి వరకు 4.45 లక్షల మందికి పైగా చనిపోయారు. కొన్ని రాష్ట్రాలు కరోనా మృతుల ఫ్యామిలీలకు ఇప్పటికే పరిహారం ప్రకటించాయి. బీహార్ రూ.4 లక్షలు, మధ్యప్రదేశ్ రూ.లక్ష, ఢిల్లీ రూ.50 వేల చొప్పున పరిహారం ఇస్తామన్నాయి. పరిహారం కోసం బాధిత ఫ్యామిలీలు క్లెయిమ్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఫామ్స్ నింపి, డాక్యుమెంట్లు జత చేయాలి. జిల్లా డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు వాటిని పరిశీలించి, 30 రోజుల్లోగా పరిష్కరించాలి. ఆధార్ లింక్ ద్వారా ఫ్యామిలీ ఖాతాలో డబ్బులు వేయాలి,అని కేంద్రం అఫిడవిట్ లో పేర్కొంది. దరఖాస్తులో ఏవైనా సమస్యలుంటే జిల్లా లెవల్ కమిటీ పరిష్కరిస్తుందని చెప్పింది. కమిటీలో అడిషనల్ కలెక్టర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (సీఎంఓహెచ్), అడిషనల్ సీఎంఓహెచ్ గానీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ లేదా కాలేజీలోని మెడిసిన్ డిపార్ట్ మెంట్ హెడ్ గానీ, సబ్జెక్టు ఎక్స్ పర్ట్ ఉంటారని తెలిపింది. ఈ కమిటీ దరఖాస్తులను పరిశీలించి పరిహారం తిరస్కరిస్తే, గల కారణాలను రికార్డు చేయాలంది.