Begin typing your search above and press return to search.

కేంద్ర కేబినెట్ విస్తరణ ఖాయం: వీరే చోటు?

By:  Tupaki Desk   |   2 July 2021 10:00 PM IST
కేంద్ర కేబినెట్ విస్తరణ ఖాయం: వీరే చోటు?
X
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చతికిల పడిన బీజేపీ ఇప్పుడు తన బలం పుంజుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకూడదని డిసైడ్ అయ్యింది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ లో భారీ మార్పులు చేయాలని మోడీ కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నాడు. పనితీరు ఆధారంగా కొందరికి ఉద్వాసన పలుకబోతున్నారని టాక్ నడుస్తోంది.

వచ్చే ఏడాది జరగబోయే ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా మోడీ మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయడానికి రెడీ అవుతున్నారు. కేంద్ర కేబినెట్ లో గరిష్టంగా 81మందికి స్థానం ఉంది. కానీ ప్రస్తుతం కేవలం 53మంది మాత్రమే మంత్రులున్నారు. మరో 28మందికి అవకాశం ఉంది. ఇటీవల ప్రధాని పలు శాఖలపై సమీక్షలు జరపడంతోపాటు యూపీ, గుజరాత్ లో ఎన్నికలు జరుగనుండడంతో ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చేలా మార్పులు ఉంటాయని సమాచారం.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్ నేత జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం నుంచి శర్వానంద సోనోవాల్ ను కేబినెట్ లో చేర్చుకోవడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీహార్ లో ఎల్జేపీని చీల్చిన పశుపతి పరాస్ కూడా మంత్రి పదవి కోసం ఫైరవీలు చేస్తున్నాడట.. బీజేపీ మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్ కూడా కేబినెట్ లో స్థానం కోసం ఎదురుచూస్తోంది.

ఇక బీహార్ లో పక్కన పెట్టిన సీనియర్లు సుశీల్ మోదీ, మహారాష్ట్ర నేత నారాయణ్ రాణే, భూపేంద్ర యాదవ్ లు తొలిసారి కేబినెట్ లో చేరనున్నట్లు సమాచారం. యూపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ఆ రాష్ట్రానికి పెద్దపీట వేయాలని భావిస్తోంది. యూపీలో గెలిస్తే కేంద్రంలో అధికారం తథ్యమే కావడంతో రాష్ట్రానికి మంత్రి పదవుల్లో పెద్దపీట వేయాలని మోడీ డిసైడ్ అయినట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం ఉన్న కేంద్రమంత్రులు పనిచేయని వారిని తొలగించి పనిచేస్తున్న వారికి ప్రమోషన్ ఇవ్వాలని మోడీ యోచిస్తున్నారట..రెండు శాఖలు చూస్తున్న వారికి పనిభారం తగ్గించి కొత్త వారికి ఇవ్వాలని మోడీ డిసైడ్ అవుతున్నారు.కొత్తగా ఎవరిని తీసుకోవాలనే దానిపై మోడీ ఫుల్ క్లారిటీతో ఉన్నారని.. రెండు మూడు రోజుల్లోనే కేంద్ర మంత్రి వర్గ పున: వ్యవస్థీకరణ జరగబోతోందని ఢిల్లీలో వార్తలు గుప్పుమంటున్నాయి.

ప్రధాని మోడీ రెండేళ్ల పాలనలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. వచ్చే మూడేళ్లలోనే పాలనను పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యారు. అందుకే పూర్తిగా యువకులు, పనిచేసే వారికే ఈసారి చోటు లభించనుందని.. భారీ ప్రక్షాళన ఉంటుందని సమాచారం.