Begin typing your search above and press return to search.

సీబీఐకి స్వేచ్చిస్తే ఇంకేమన్నా ఉందా ?

By:  Tupaki Desk   |   19 Aug 2021 5:30 AM GMT
సీబీఐకి స్వేచ్చిస్తే ఇంకేమన్నా ఉందా ?
X
‘సీబీఐ పరిస్దితి పంజరంలో చిలుకలాగ తయారైందని కేంద్ర ఎన్నికల కమీషన్, కాగ్ లాగ సీబీఐకి కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలి’ ..ఇవి ఓ కేసు విచారణ సందర్భంగా చెన్నై హైకోర్టు కేంద్రానికి ఇచ్చిన ఆదేశాలు. సీబీఐ పంజరంలో చిలుకలాగ తయారైందన్న వ్యాఖ్యలు ఇపుడు కొత్తేమీకాదు. చాలాకాలం క్రితం ఇవే వ్యాఖ్యలను సుప్రింకోర్టు కూడా చేసింది. సీబీఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలని అప్పట్లోనే కేంద్రానికి సుప్రింకోర్టు సూచించింది. అయితే సుప్రింకోర్టు సూచనలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు.

ఎందుకు పట్టించుకోలేదంటే కేంద్రంలో అధికారంలో ఎవరున్నా ప్రత్యర్ధులను ఇబ్బందులు పెట్టడానికి సీబీఐనే ప్రయోగిస్తున్నారు కాబట్టే. ప్రత్యర్ధులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి అతిపెద్ద అస్త్రం సీబీఐయే. కాబట్టే సీబీఐకి స్వయం ప్రతిపత్తి ఇవ్వటానికి కేంద్రంలోని పాలకులు ఇష్టపడటంలేదు. మళ్ళీ వీళ్ళే ప్రతిపక్షంలో కూర్చుంటే మాత్రం సీబీఐ కేసులు, దర్యాప్తుపై ఆరోపణల మీద ఆరోపణలు చేస్తారు.

మిగిలిన దేశం సంగతి ఎలాగున్నా ఏపి విషయంలో మాత్రం సీబీఐ పరిస్ధితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమవుతోంది. బీజేపీలోకి నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపిలు ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే. సుజనా చౌదరి, సీఎం రమేష్ లు టీడీపీలో ఉన్నపుడు సీబీఐ, ఈడీ, ఐటి ఉన్నతాధికారులు పదే పదే వీళ్ళ కార్యాలయాలు, ఇళ్ళపై దాడులు చేశారు. సుజనాను అరెస్టు చేయటమే ఇక మిగిలింది అన్నట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. బెంగుళూరులో విచారణకు హాజరుకాకపోతే అరెస్టు చేస్తామని సీబీఐ ఫైనల్ నోటీసు కూడా ఇచ్చిందన్నారు.

సీన్ కట్ చేస్తే చివరకు ఏమి జరిగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోగానే వీళ్ళంతా బీజేపీలోకి ఫిరాయించారు. అప్పటి నుండి వీళ్ళపై అంటే గడచిన రెండేళ్ళల్లో దాడులు లేవు, విచారణలు జరగటంలేదు. దీన్నిబట్టి ప్రత్యర్ధులపైకి సీబీఐని కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు ఎలా ప్రయోగిస్తున్నారో అందరికీ అర్ధమవుతోంది. కాబట్టి బ్రహ్మాస్త్రం లాంటి సీబీఐని కేంద్రంలోని పెద్దలు వదులుకుంటారా ?

నిజంగానే సీబీఐ పరిస్ధితి పంజరంలో చిలుకలాగ కాకుండా నిజంగా స్వేచ్చగా పనిచేసే వాతావరణం ఉండాలంటే స్వయం ప్రతిపత్తి ఉండాల్సిందే. కేంద్ర ఎన్నికల కమీషన్, కాగ్ కు స్వయం ప్రతిపత్తి ఇచ్చిందంటే దాని ద్వారా కేంద్రంలోని పెద్దలకు పెద్దగా ఉపయోగాలు లేవుకాబట్టే. ఎందుకంటే పై రెండు వ్యవస్ధలను ప్రయోగించి ప్రత్యర్ధులను ఇరకాటంలో పెట్టేందుకు ఉన్న అవకాశాలు చాలా తక్కువ. అందుకనే వీటికి స్వేచ్చ దక్కింది. కానీ సీబీఐ పరిస్దితి అలాకాదు. అందుకనే కోర్టులు ఎన్ని ఆదేశాలిచ్చినా కేంద్రం పట్టించుకోవటంలేదు.