Begin typing your search above and press return to search.

ఆశా వర్కర్లు అడుగుతున్నది అక్రమమా?

By:  Tupaki Desk   |   17 Dec 2015 11:17 AM GMT
ఆశా వర్కర్లు అడుగుతున్నది అక్రమమా?
X
ప్రపంచంలోని ఏ దేశంలో అయినా పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారు. ఒక్క భారతదేశంలో తప్ప. ప్రపంచంలో ఏ దేశంలో అయినా పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తారు. ఒక్క భారతదేశంలో తప్ప. ప్రపంచంలో ఏ దేశంలో అయినా పారిశుద్ధ్య పనులను యంత్రాలతో అత్యాధునిక పరికరాలతో చేస్తారు. ఒక్క భారతదేశంలో తప్ప. ఇక్కడ మాత్రమే మనుషుల వ్యర్థాలను మనుషులు శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయినా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు తక్కువగానే ఉంటాయి. వారికి జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం కూడా వెనకాడుతుంది.

ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తారు. ఒక్క భారతదేశంలో తప్ప. ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందుతున్న దేశంలో అయినా మాతా శిశు మరణాలు తక్కువే ఉంటాయి. ఒక్క భారతదేశంలో తప్ప. ఆరోగ్య రంగంలో పని చేసే కార్మికులకు ఇతర దేశాల్లో అత్యధిక వేతనాలు ఉంటాయి. ఒక్క భారతదేశంలో తప్ప.

ఇందుకు మరో ఉదాహరణ ఆశా వర్కర్లు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని వారు దాదాపు మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇక్కడ తప్పు, రాష్ట్రానిదా కేంద్రానిదా అన్నది కాదు.. అసలు ఏ ప్రభుత్వాలూ పట్టించుకోకపోవడమే పెద్ద సమస్య.

తమకు కనీస వేతనంగా రూ.15 వేలు చెల్లించాలని ఆశా వర్కర్లు అడుగుతున్నారు. ఇదేమంత పెద్ద జీతం కూడా కాదు. అలాగే విద్యార్హతలు కలిగి అర్హులు అయిన వారిని రెండో ఏఎన్ ఎంగా తీసుకోవాలని - పింఛను - గ్రాట్యుటీ - ప్రసూతి సెలవులను కేటాయించాలని కోరుతున్నారు. ఇది ఏమంత పెద్ద ప్రతిపాదన? ఇక, గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లడం, తీసుకు రావడం చేస్తుంటారు. ఇందుకు టీఏ - డీఏ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాద బీమా కల్పించాలని, ప్రసూతి సేవల పారితోషికం పెంచాలని కోరుతున్నారు. నిజానికి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే. కానీ, ఇప్పుడు సమస్య అంతా ఎవరు పరిష్కరించాలన్నదే. రాష్ట్రం పరిష్కరించాలని కేంద్రం.. కేంద్రం పరిష్కరించాలనిరాష్ట్రం భావించడంతోనే ఈ సమస్య పరిష్కారం కావడం లేదు.