Begin typing your search above and press return to search.

జ‌ల ర‌గ‌డ‌లో కేంద్రం స‌యోధ్య‌

By:  Tupaki Desk   |   15 July 2021 9:30 AM GMT
జ‌ల ర‌గ‌డ‌లో కేంద్రం స‌యోధ్య‌
X
కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య సాగుతోన్న జ‌ల ర‌గ‌డ‌పై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం దృష్టి సారించిన‌ట్లు క‌నిపిస్తోంది. కృష్ణా న‌దిపై అక్ర‌మంగా ప్రాజెక్టులు క‌డుతున్నారంటూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒక‌దానిపై మ‌రొక‌టి విమ‌ర్శ‌లు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఒక ప్ర‌భుత్వంపై మ‌రొకరు ప్ర‌భుత్వం ఫిర్యాదు చేస్తూ కేంద్రానికి లేఖ‌ల మీద లేఖ‌లు రాశారు. దీంతో ఈ ప‌రిణామాల‌ను తీవ్రంగా పరిగ‌ణించిన ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం (పీఎమ్‌వో) రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టింద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ను దిల్లీకి ర‌ప్పించే అవ‌కాశాలున్న‌ట్లు మాట‌లు వినిపిస్తున్నాయి.

దిల్లీ వ‌ర్గాల ప్ర‌కారం కృష్ణా న‌దిపై తెలంగాణ అక్ర‌మంగా ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతూ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తూ రాయ‌ల‌సీమ‌కు అన్యాయం చేస్తుందంటూ ఏపీ సీఏం జ‌గ‌న్ రాసిన లేఖ‌ల‌ను ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం తీవ్రంగా ప‌రిగ‌ణించింద‌ని స‌మాచారం. ఈ స‌మ‌స్య‌పై త‌క్ష‌ణ‌మే దృష్టి సారించి రెండు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న వివాదాన్ని ప‌రిష్క‌రించాల‌ని కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ‌ను పీఎమ్‌వో ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో త్వ‌ర‌లోనే అపెక్స్ కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హించే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి.

కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స‌భ్యులుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రు సీఎంల‌కు వీలైన తేదీలో కౌన్సిల్ స‌మావేశాన్ని నిర్వ‌హించి వాళ్ల‌ను ర‌ప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే ప్ర‌స్థుత ప‌రిస్థితుల్లో కేసీఆర్‌, జ‌గ‌న్ ఈ స‌మావేశానికి రావ‌డానికి ఆస‌క్తి చూపిస్తారా? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ మీద ఆరోప‌ణ‌లు చేస్తూ ప‌రిష్కారం చూపే బాధ్య‌త‌ను కేంద్రానికే వ‌దిలేసిన జ‌గ‌న్‌.. కేసీఆర్‌ను క‌లిసేందుకు వ‌చ్చే విష‌యంపై అనుమానాలున్నాయి.

మ‌రోవైపు చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోకుండా కేంద్రం గ‌డ‌ప తొక్కిన జ‌గ‌న్‌పై కేసీఆర్ గుర్రుగానే ఉన్నారు. ఈ నెల 9న నిర్వ‌హించాల‌నుకున్న కృష్ణా న‌ది మేనేజ్‌మెంట్‌ బోర్డు స‌మావేశానికి హాజ‌ర‌యేందుకు తెలంగాణ ఒప్పుకోలేదు. దీంతో ఆ స‌మావేశాన్ని 22కు వాయిదా వేయాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో అపెక్స్ కౌన్సిల్ స‌మావేశానికి వ‌చ్చేలా ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ను కేంద్రం ఎలా ఒప్పిస్తుందో చూడాలి.