Begin typing your search above and press return to search.

కరోనా పరీక్షలపై కేంద్రం కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   1 Jan 2022 4:30 PM GMT
కరోనా పరీక్షలపై కేంద్రం కీలక ఆదేశాలు
X
దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మూడో ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో పటిష్ట చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కరోనా కట్టడికి కృషి చేయాలని కంకణం కట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్ని రాష్ట్రాల్లోనూ వైరస్ నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేయాలని సూచించింది. అంతేకాకుండా సాధారణ జ్వరంతో బాధపడే ప్రతి వ్యక్తిని కూడా పరీక్షించాలని చెప్పింది. జలుబు, దగ్గు, నీరసం, ఒంటి నొప్పులు, శ్వాస సంబంధ సమస్యలు, డయేరియా వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయాలని పేర్కొంది.

ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా కూడా వెంటనే పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఇకపోతే వైరస్ నిర్ధారణ అయిన వారిని వెంటనే ఐసోలేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావాలని పేర్కొంది. రాష్ట్రాల్లో ప్రతీఒక్కరూ కరోనా నిబంధనలు పాటించేలా చూసుకోవాలని పలు సూచనలు చేసింది. మరి కొన్నాళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.

కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 24 గంటల్లో 22 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాకుండా ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1400 పైగా కొత్త వేరియంట్ కేసులు ఉండడం ఆందోళన కలిగించే అంశమే. దేశంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు సైతం వైరస్ బారిన పడ్డారు. ఇదిలా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది.