Begin typing your search above and press return to search.

బాబు పోల‌వ‌రం స్పీడ్‌ కు కేంద్రం బ్రేకులు

By:  Tupaki Desk   |   8 Nov 2017 5:20 PM GMT
బాబు పోల‌వ‌రం స్పీడ్‌ కు కేంద్రం బ్రేకులు
X
పోల‌వ‌రం కు మోడీ స‌ర్కారు బ్రేకులు వేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌క‌మైన కాఫ‌ర్ డ్యాంల నిర్మాణాన్ని ఆపాలంటూ చెప్పింది. పోల‌వ‌రం ప్రాజెక్టుకు కీల‌మైన కాప‌ర్ డ్యాంల నిర్మాణానికి చెక్ చెప్ప‌టం ద్వారా బాబుకు మోడీ స‌ర్కారు భారీ దెబ్బేసింద‌ని చెబుతున్నారు.

ఇంత‌కీ ఈ కాప‌ర్ డ్యాం ఏమిటి. పోల‌వ‌రం ప్రాజెక్టులో దీని పాత్ర ఎంత‌? అన్న అంశాల విష‌యానికి వెళితే.. ఏదైనా ప్రాజెక్టులో ప్ర‌ధాన డ్యాం నిర్మాణానికి ముందు ఎగువ‌న‌.. దిగువ‌న కాఫ‌ర్ డ్యాంల‌ను నిర్మిస్తారు. వ‌ర‌ద నీటిని వాటి ద్వారా మ‌ళ్లించి ప‌నులు సులువుగా.. త్వ‌ర‌గా అయ్యేలా చేయ‌టం ఉంటుంది. ఓ మోస్త‌రు ప్రాజెక్టుల‌కే ఇలాంటివి అవ‌స‌ర‌మైన వేళ‌.. పోల‌వ‌రం లాంటి భారీ ప్రాజెక్టుల‌కు కాప‌ర్ డ్యాంలు చాలా కీల‌కం.

కాఫ‌ర్ డ్యాం ఎత్తును 42 మీట‌ర్ల‌కు పెంచుకుంటే 2018 త‌ర్వాత నీళ్లు కాలువ‌ల‌కు వ‌దిలిపెట్టి ప్ర‌ధాన డ్యాం నిర్మాణం చేయొచ్చు. అంటే.. ఎన్నిక‌లకు దాదాపు ఏడాది ముందే పోల‌వ‌రం ప్రాజెక్టు ద్వారా కాలువ‌ల‌కు నీళ్లు ఇప్పించొచ్చు. ఇదే జ‌రిగితే బాబు ఘ‌న‌త మారుమోగుతోంది. అనుకున్న స‌మ‌యానికి నీళ్లు వ‌దిలిన ఘ‌న‌త బాబు ఖాతాలో ప‌డుతుంది. అదే జ‌రిగితే.. ఏపీలో ఏదో ర‌కంగా త‌మ ముద్ర వేసి.. రాజ‌కీయంగా బ‌ల‌ప‌డాల‌న్న క‌మ‌ల‌నాథుల క‌ల‌లు క‌ల్ల‌ల‌వుతాయి.

అందుకే కాబోలు.. కేంద్రం చిత్ర‌మైన తిర‌కాసును తెర మీద‌కు తెచ్చింది. పోల‌వ‌రంప్రాజెక్టుకు కాఫ‌ర్ డ్యాం అవ‌స‌రం లేద‌ని.. దానికి ప్ర‌త్యామ్నాయంగా కూడా ప‌నులు చేయొచ్చ‌ని.. నిపుణుల‌ను పంపి అధ్య‌య‌నం చేశాక ఆలోచిద్దామ‌ని కేంద్రం పేర్కొంది. అప్ప‌టివ‌ర‌కూ ప‌నులు ఆపేయాల‌ని కేంద్రం ఆదేశించింది. కేంద్రం తీరు చూస్తే కొత్త సందేహాలు రావ‌టం ఖాయం. ఎక్క‌డైనా ప్రాజెక్టు ప‌నులు ఆల‌స్య‌మైతే రాష్ట్రాలకు చురుకుపుట్టించేలా చేస్తాయి. అందుకు భిన్నంగా చురుగ్గా జ‌రుగుతున్న ప‌నుల‌కు జెల్ల‌కాయ కొట్టేలా కేంద్రం చేసిన ఆదేశాలు కొత్త అనుమానాల‌కు తెర తీయ‌ట‌మే కాదు.. ఏపీకి మేలు చేసే ఏ ప‌నిని ప్ర‌ధాని మోడీ ముందుకెళ్ల‌కుండా చేయాల‌నుకుంటున్నారా అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.