Begin typing your search above and press return to search.

రాయలసీమ ఎత్తిపోతలపై జగన్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   27 Dec 2020 6:00 AM GMT
రాయలసీమ ఎత్తిపోతలపై జగన్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్
X
తెలంగాణ సహా ఏపీలోని ప్రతిపక్షం వ్యతిరేకిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్ సర్కార్ కు ఊరట లభించింది. కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ప్రతిష్టాత్మక పనులపై ముందడుగు పడింది. తాజాగా ఈ ఎత్తిపోతల పథకంపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీని నిర్మాణానికి అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది.

ఇదివరకే అన్ని రకాల అనుమతులు పొందిన పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామంటూ ప్రభుత్వం వినిపిస్తున్న వాదనలతో కేంద్రం ఏకీభవించడం విశేషం. దీనికి అదనంగా ఎలాంటి సాంకేతిక పరమైన అనుమతులు మంజూరు చేయాల్సిన అవసరం లేదని తాము గుర్తించినట్టు పేర్కొన్నారు.

కేంద్ర జలసంఘం తాజాగా వెల్లడించిన తన అభిప్రాయంతో ఈ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం దిశగా ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రారంభ పనులను ముగించుకుంది. ఈ పథకం నిర్మాణానికి ఇదివరకే కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, గ్రీన్ ట్రిబ్యూనల్ అనుమతులు వచ్చాయి. తాజాగా సీడబ్ల్యూసీ కూడా తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఇక కృష్ణా బోర్డు అనుమతిని ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అదొక్కటి వస్తే సీమ ఎత్తిపోతలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్టే.

రాయలసీమ ఎత్తిపోతలం పథకంతో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు సాగు, మంచినీటి సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకం చేపట్టింది. కృష్ణ జలాల్లో మిగులు వాటాను, వరదను ఈ ప్రాజెక్టు ద్వారా మళ్లించి సీమను సస్యశ్యామలం చేస్తారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వరద జలాలను మళ్లించడానికి పోతిరెడ్డిపాడును నాటి ప్రభుత్వం నిర్మించింది. దీన్ని మరింత విస్తరించాలన్నది తమ ప్రణాళికగా చెప్పుకొచ్చింది.