Begin typing your search above and press return to search.

పతంజలి కరోనిల్.. రాందేవ్ బాబాకు బీజేపీ షాక్

By:  Tupaki Desk   |   25 Jun 2020 11:50 AM GMT
పతంజలి కరోనిల్.. రాందేవ్ బాబాకు బీజేపీ షాక్
X
హిందుత్వకు బీజేపీకి దగ్గరి సంబంధాలున్నాయి. ఆ కోవలోనే బాబాలు, పీఠాధిపతులు హిందుత్వ వాదులంతా బీజేపీ హయాంలో వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం అండతో రెచ్చిపోయారు ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్. బీజేపీ తొలి ప్రభుత్వంలో ‘పతంజలి’ పేరిట స్వదేశీ, సహజసిద్ధమైన ఉత్పత్తులు అంటూ మార్కెట్లోకి వదిలారు. అవి మామూలు వస్తువులేనని పరిశోధనల్లో తేలింది. నిపుణులు కూడా ఇదంతా మోసం అంటూ గళమెత్తారు. అయినా పతంజలి ప్రోడక్ట్స్ కు భారీగా జనాదరణ దక్కడంతో కార్పొరేట్ కంపెనీలకు వణుకుపుట్టింది. బీజేపీ పెద్దలు సహకరించడంతో ఈ పతంజలి సంస్థ వేల కోట్ల రూపాయల సంస్థగా మారింది. బీజేపీ అధికారంలో ఉండడంతో దీన్ని టచ్ చేసే సాహసం చేయలేదు. కానీ పాపం ఇప్పటికీ పండింది.

కరోనా నివారణ మందు పేరిట పతంజలి సంస్థ తాజాగా ‘కరోనిల్’ అంటూ మందును మార్కెట్లోకి విడుదల చేసింది.అదే రాందేవ్ బాబా కొంప ముంచింది. ప్రజల భయాలను సొమ్ము చేసుకుందామనుకున్న ఆయన ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు మందే కనిపెట్టలేదని.. ఎలా దీన్ని మార్కెట్ చేస్తారని ఆ మందు విడుదలను ఆపేసింది.తాజాగా ఇలా కరోనా పేరుతో మందు విడుదల చేసి మోసం చేస్తున్నారని బీహార్ కోర్టులో ఓ క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు.

ప్రస్తుతం కరోనా టైంలో క్యాష్ చేసుకుందామని మందు విడుదల చేసి మోసం చేసిన పాపానికి పతంజలి బ్రాండ్ విలువ మరింత దిగజారింది. ఒకప్పుడు కార్పొరేట్లకు చాలెంజ్ విసిరిన పతంజలిపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

ఎందుకంటే జలుబు, దగ్గు మందుగా కేంద్ర ఆయుష్ శాఖ దగ్గర దరఖాస్తు చేసుకొని కరోనా నివారణ మందుగా మార్కెట్లోకి పతంజలి విడుదల చేయడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. దాన్ని నిషేధించి రాందేవ్ బాబాకు షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు మందు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ఆపసోపాలు పడుతుంటే యోగా గురువు రాందేవ్ ఆడిన ఈ ఆట అభాసుపాలైంది. ఆ ప్రభావం ఆయన ఉత్పత్తులపై పడబోతోంది. కేంద్రం అండతో ఇన్నాళ్లు రెచ్చిపోయిన రాందేవ్ బాబాకు ఇప్పుడు కరోనా బాగానే దెబ్బకొట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు.