Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ‘శ్మశాన దోపిడీ’!

By:  Tupaki Desk   |   24 May 2021 8:00 AM IST
హైదరాబాద్ లో ‘శ్మశాన దోపిడీ’!
X
‘‘డ‌బ్బులేక‌పోతే బ‌తుకే కాదు.. చావుకూడా స‌రిగ్గా జ‌ర‌గ‌దు’’ కేజీఎఫ్ హీరో త‌ల్లిపాత్ర ప‌లికే డైలాగ్ ఇది. ఇప్పుడు కొవిడ్ నేప‌థ్యంలో క‌ళ్లారా చూడాల్సిన ప‌రిస్థితి. చ‌నిపోయిన వారికి శ్మ‌శానాల్లో అంత్య‌క్రియ‌లు చేయ‌డానికి వేల‌కు వేలు డ‌బ్బులు గుంజుతున్న వైనంపై తీవ్ర ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ లో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు.

కొవిడ్ గోల మొద‌లైన నేప‌థ్యంలో మృతుల సంఖ్య పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శ‌వ ద‌హ‌నానికి ఎంత వ‌సూలు చేయాలో జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. సాధార‌ణ శ‌వానికి 6 వేలు, కొవిడ్ శ‌వానికి 8 వేలు తీసుకోవాల‌ని చెప్పింది. కానీ.. ఎక్క‌డా ఇది అమలు కావ‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఒక్కో మృత‌దేహానికి ఏకంగా 15 వేల రూపాయ‌లు వ‌సూలు చేస్తున్నార‌ట‌. ఈ మొత్తం చెల్లిస్తేనే ద‌హ‌నం చేస్తామ‌ని చెబుతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని ప‌లువురు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు ఈ పరిస్థితిపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి దోపిడీలో తాము సేవ‌లు కొన‌సాగించ‌డం క‌ష్ట‌మ‌వుతోంద‌ని వాపోయారు.

దీంతో.. జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. బ‌ల్దియా నిర్ణ‌యించిన ధ‌ర‌క‌న్నా ఎక్కువ‌గా వ‌సూలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ఎవ‌రైనా ఎక్కువ డ‌బ్బులు డిమాండ్ చేస్తే... 040 - 2111 1111 నంబ‌ర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. మ‌రి, ఇక‌నైనా ఈ శ‌వ దోపిడీ ఆగుతుందో లేదో చూడాలి.