Begin typing your search above and press return to search.

గాలి వారింట పెళ్లికి దిగి వచ్చిన తారలు

By:  Tupaki Desk   |   16 Nov 2016 3:16 PM GMT
గాలి వారింట పెళ్లికి దిగి వచ్చిన తారలు
X
గాలి జనార్దన్ రెడ్డి ఏమైనా ఆషామాషీ వ్యక్తా. మైనింగ్ మాఫియాకు కింగ్ లాంటోడు. డబ్బుల్నికొండలుగా పేర్చాలే కానీ.. వెండితెర మీద వెలిగిపోయే తారలు బిలబిలామంటూ దిగి వచ్చేసే పరిస్థితి. డబ్బుకున్న పవర్ ఎలాంటిదో గాలి గతంలోనే చూపించారు. తనకున్న సంపద షోకును తన కుమార్తె బ్రాహ్మణి పెళ్లి సందర్భంగా మరోసారి అందరికి తెలిసేలా చేశారు.

గాలి వారింట జరుగుతున్న పెళ్లి వేడుకకు బీజేపీ.. కాంగ్రెస్ నేతలు కాస్త దూరంగా ఉన్నప్పటికీ.. వెండితెర వేల్పులు.. సెలబ్రిటీలు.. బిగ్ షాట్స్ మాత్రం క్యూ కట్టారు. బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూక్.. కత్రినా కైఫ్.. కాజోల్ లాంటి వాళ్లు అయితే ఒక రోజు ముందే బెంగళూరుకు వచ్చేసి షాకిచ్చేశారు. మామూలుగా పెళ్లిళ్లు లాంటి వేడుకలకు రావటమే గొప్పగా ఉండే అగ్ర సినీనటులు.. ఏకంగా ఒక రోజు ముందే వచ్చేయటం చూస్తే గాలా? మజాకానా? అనిపించాల్సిందే.

బాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులతో పాటు కన్నడ.. తమిళ.. తెలుగు సినిమా రంగానికి చెందిన ఎందరో తారలు.. ప్రముఖులు గాలి వారింట జరిగిన పెళ్లికి హాజరయ్యారు. హీరోయిన్ల విషయానికి వస్తే రకుల్ ప్రీత్.. ప్రియమణి.. స్నేహ.. మీనా.. రాధిక.. లాంటి వారెందో హాజరయ్యారు. ఇక.. కమెడియన్లకు కొదవ లేకుండా పోయిందని చెబుతున్నారు.

జబర్దస్త్ స్కిట్లతో పెళ్లి మండపం మొత్తం నవ్వులు పువ్వులయ్యయని చెబుతున్నారు. పేరు మోసిన సింగర్స్ హిందీ.. కన్నడ.. తెలుగు పాటల్ని పాడి అలరిస్తే.. పెళ్లి సందర్భంగా వేసిన సెట్టింగ్స్.. ఏర్పాటు చేసిన విందు మొత్తం గాలి రేంజ్ ను చూపించాయట. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో జరుపుతున్న పెళ్లి అన్నాక ఆ మాత్రం విశేషాలు ఉండవా?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/