Begin typing your search above and press return to search.

గెలిస్తే సంబరం.. ఓడితే విధ్వంసమా..? ఫుట్ బాల్ అభిమానం వెర్రితలలు

By:  Tupaki Desk   |   15 Dec 2022 12:30 PM GMT
గెలిస్తే సంబరం.. ఓడితే విధ్వంసమా..? ఫుట్ బాల్ అభిమానం వెర్రితలలు
X
అది 1994 ఫుట్ బాల్ ప్రపంచ కప్. ఇప్పటి క్రొయేషియాలా అప్పట్లో కొలంబియా జట్టు అండర్ డాగ్. దూకుడైన ఆటతీరుతో అదరగొడుతూ ప్రపంచ కప్ లో సంచలనాలు రేపేల కనిపించింది. పైగా ఆ ప్రపంచ కప్ జరుగుతున్నది కొలంబియాకు దగ్గర్లోని అమెరికాలో. దీంతో ఆ జట్టుపై భారీ బెట్టింగ్ లు. కానీ, బ్యాడ్ లక్ తో కొలంబియా ఆటగాడు ఆండ్రెస్ ఎస్కోబార్ ఓ మ్యాచ్ లో సెల్ఫ్ గోల్ చేశాడు. దీంతో జట్టు ఓడిపోయింది. ఆ ప్రభావంతో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. కప్ లో కొలంబియ ప్రస్థానంతో పాటు ఎస్కోబార్ జీవితమూ ముగిసింది.

బార్ లో కాల్చిపడేశారు..ప్రపంచ కప్ లో కొలంబియా నిష్ర్కమణ అనంతరం జట్టు ఇంటికి చేరింది. అనంతరం ఓ బార్ లో ఎస్కోబార్ హత్యకు గురయ్యాడు. అతడిని కాల్చివేశారు. ఈ పని చేసింది డ్రగ్ మాఫియా అని తర్వాత తేలింది. కొలంబియాపై బెట్టింగ్ లు కాసి.. ఓడిపోయినందునే ఎస్కోబార్ ను హత్య చేశారు. అట్లుంటది ఫుట్ బాల్ లో పరిస్థితి. ఇక ఈ ప్రపంచ కప్ నకు వస్తే.. గత నెల 28న మొరాకోతో మ్యాచ్ లో బెల్జియం ఓటమిపాలయినప్పుడూ ఏ విధంగా అల్లర్లు చెలరేగాయో తెలిసిందే. వాస్తవానికి బెల్జియం గత ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరింది.

ప్రపంచ ర్యాంకుల్లోనూ నంబర్ 3గా ఉంది. దీంతో ఈసారీ జట్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ, ముందే నిష్క్రమణతో అభిమానులు ఆగ్రహోదగ్రులయ్యారు.మొరాకోకు ఎందుకో అంత ఉలుకు?బెల్జియం అంటే ఫేవరెట్ లలో ఒకటి. కానీ, మొరాకో అలా కాదు. కనీసం నాకౌట్ కు చేరినా గొప్పే. అలాంటి జట్టు ఏకంగా సెమీస్ కు వచ్చింది. ప్రి క్వార్టర్స్ లో స్పెయిన్ ను, క్వార్టర్స్ లో పోర్చుగల్ వంటి బలమైన జట్లను ఓడించి సెమీస్ చేరినప్పటికీ మొరాకో అభిమానులు అంతటితో సంబరపడినట్లు లేరు. బుధవారం సెమీస్ లో ఫ్రాన్స్ చేతిలో ఓటమి అనంతరం ఐరోపా దేశాల్లో అల్లర్లకు దిగారు. వీధుల్లో వీరంగం ఆడారు.

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో హింసకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి నాటి మ్యాచ్ లో ఫ్రాన్స్‌ 2-0తో మొరాకోను ఓడించింది. దీంతో బ్రస్సెల్స్‌లోని మొరాకో అభిమానులు ఒక్కసారిగా విధ్వంసానికి దిగారు. దాదాపు 100 మందితో కూడిన ఓ అల్లరి మూక పోలీసులతో ఘర్షణ పడింది. టపాసులు విసురుతూ.. వీధుల్లో చెత్త సంచులు ఓచోటకు చేర్చి నిప్పు పెట్టారు. అప్రమత్తమైన పోలీసులు భాష్పవాయువును ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొందరు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఓ మొరాకో (Morocco)అభిమాని రోడ్డుపై పడిపోయాడు.

మరోవైపు ఫ్రాన్స్‌ (France ) అభిమానులు కొందరు తెల్లటి కారులో అక్కడకు వచ్చి యూటర్న్‌ తిప్పే సమయంలో ఓ బాలుడు చక్రాల కింద నలిగిపోయాడు. తీవ్రగాయాల పాలైన అతడిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందినట్లు ప్రకటించారు. ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌ సందర్భంగా ఐరోపా సమాఖ్యలోని ఫ్రాన్స్‌, బెల్జియంలోని పలు చోట్ల భారీగా ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. వీటిని అదుపు చేయడానికి పోలీసు బలగాలు తీవ్రంగా శ్రమించాయి. ఫ్రాన్స్‌(France)లోని మాంట్‌పెల్లిర్‌, నైస్‌ పట్టణాల్లో వీధిపోరాటాలు జరిగాయి. పరస్పరం బాణసంచా విసురుకున్నారు.

చరిత్రలో నిలిచి చేసిందిదా..ఈ ప్రపంచ కప్ జర్మనీకి పెద్ద చేదు అనుభవం. పోర్చుగల్ కు పీడకల. స్పెయిన్ కు చేదు మాత్ర. బ్రెజిల్ కు అందని ద్రాక్ష. కానీ, మొరాకోకు మాత్రం మరిచిపోలేని గుర్తు. ఫిఫా పోటీల్లో సెమీస్ కు చేరిన తొలి ఆఫ్రికా జట్టుగా చరిత్రలో నిలిచిపోయింది.కానీ, ఆ దేశ అభిమానులు బుధవారం చేసిన విధ్వంసం దీన్నంతటినీ మరుగునపడేంతగా చెడ్డ పేరు తెచ్చింది. అందుకనే పెద్దలు అంటారు.. విజయం దక్కడం కాదు.. దానిని నిలుపుకోవడం ప్రధానమని.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.