Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తేల్చేసింది..ఆ సీనియ‌ర్ల‌కు చేదువార్తే

By:  Tupaki Desk   |   7 Oct 2018 6:58 AM GMT
కాంగ్రెస్ తేల్చేసింది..ఆ సీనియ‌ర్ల‌కు చేదువార్తే
X
తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌ల షెడ్యూల్ ఖ‌రారు కావ‌డంతో కాంగ్రెస్ జోరు పెంచేందుకు కాంగ్రెస్ స‌మాయ‌త్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే 105 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌చార ప‌ర్వంలో దూసుకెళ్తున్న టీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకుగాను త్వ‌ర‌లోనే త‌మ అభ్య‌ర్థుల పేర్ల‌నూ ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకెళ్లి త‌గినంత ప్ర‌చారం చేసుకునే వెసులుబాటు వారికి క‌ల్పించాల‌ని సంక‌ల్పించింది. ఈ దిశ‌గా టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో శ‌నివారం స‌మావేశ‌మైన ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ (పీఈసీ) ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. వాటిలో ప్ర‌ధాన‌మైన‌ది.. మ‌హా కూట‌మిలో సీట్ల పంప‌కాల‌ను త్వ‌ర‌గా ముగించి, 16వ తేదీలోగా పార్టీ అభ్య‌ర్థుల పేర్లు ప్ర‌క‌టించ‌డం. ఇది అంద‌రికీ ఆమోద‌నీయ‌మైన అంశ‌మే.

పీఈసీ స‌మావేశంలోనే కాంగ్రెస్ ఓ కీల‌క విష‌యాన్ని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైన‌ప్ప‌టి నుంచి నానుతున్న వార‌స‌త్వ రాజ‌కీయాల అంశంపై త‌మ వాద‌న‌ను ఉద్ఘాటించింది. ఈ ఎన్నిక‌ల్లో ఒక కుటుంబానికి ఒక టికెట్ మాత్ర‌మే కేటాయిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఏ కుటుంబానికీ రెండు, మూడు సీట్లు ఇవ్వ‌బోమ‌ని తేల్చిచెప్పింది. దీంతో ఈ ఎన్నిక‌ల్లో త‌మ‌తోపాటు త‌మ వార‌సుల‌ను కూడా బ‌రిలోకి దించాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న కొంత‌మంది సీనియ‌ర్ల‌కు గ‌ట్టి షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.

కాంగ్రెస్ తాజా ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌ధానంగా ఖంగుతిన్న‌ది జానా రెడ్డి, డి.కె.అరుణ‌, ముకేశ్ గౌడ్ వంటి సీనియ‌ర్లేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు ద‌శాబ్దాలుగా అసెంబ్లీకి వెళ్తున్న జానా.. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో త‌న కుమారుణ్ని కూడా బ‌రిలో దించాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేశారు. డిల్లీ వెళ్లి అధిష్ఠానం పెద్ద‌ల్ని కూడా క‌లిశారు. మిర్యాలగూడ టికెట్ త‌న కుమారుడికి ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. లేనిప‌క్షంలో తాను మిర్యాల‌గూడ నుంచి పోటీ చేస్తాన‌ని.. నాగార్జున సాగ‌ర్ టికెట్ త‌న కుమారుడికి ఇవ్వాల‌నీ కోరారు. ఇక డి.కె.అరుణ సైతం త‌న కుమార్తెను ఈసారి అసెంబ్లీకి పంపించాల‌ని ప్ర‌య‌త్నించారు. ఆమె టికెట్ కోసం ట్రై చేశారు. ముకేశ్ గౌడ్ కూడా త‌న కుమారుడి టికెట్ కోసం అధిష్ఠానానికి మొర‌పెట్టుకున్నారు.

ఇలా వార‌సుల‌ను బ‌రిలో దించేందుకు ప్ర‌య‌త్నించిన‌వారిలో.. టీఆర్ఎస్ నుంచి ఇటీవ‌లే సొంత‌గూడు కాంగ్రెస్‌కు చేరుకున్న ఫైర్‌బ్రాండ్ కొండా సురేఖ కూడా ఉన్నారు. కుమార్తె సుస్మిత ప‌టేల్‌ను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని ఆమె భావించారు. నిజానికి సురేఖ రెండు కాదు.. త‌మ కుటుంబానికి ఏకంగా మూడు సీట్లు కావాల‌ని కోరుకున్నారు. భ‌ర్త కొండా ముర‌ళినీ ఎన్నిక‌ల బ‌రిలో దించాల‌ని అనుకున్నారు. కానీ, కుటుంబానికి ఒకే సీటంటూ కాంగ్రెస్ చేసిన‌ తాజా ప్ర‌క‌ట‌న జానా, అరుణ స‌హా సీనియ‌ర్లంద‌రికీ శ‌రాఘాత‌మే. అయితే, ఇక్క‌డే మ‌రో విష‌యంపై కూడా కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. గ‌త ఎన్నిక‌ల్లోనే ఒకే కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చి ఉంటే మాత్రం వారిని త‌ప్పించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. కోమ‌టి బ్ర‌ద‌ర్స్ వంటి వారికి ఈ మిన‌హాయింపు వ‌ర్తిస్తుంద‌న్న‌మాట‌.