Begin typing your search above and press return to search.

రావెల కొడుకు లీలల వీడియో బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   5 March 2016 12:05 PM GMT
రావెల కొడుకు లీలల వీడియో బయటకొచ్చింది
X
తండ్రికి ఉన్న పదవి.. పలుకుబడి చూసుకొని విర్రవీగిపోయే కొడుకులకు బుద్ధి రావటమే కాదు.. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండకపోతే.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోవటమే కాదు.. చట్టం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందన్న విషయం ఇక అందరికి అర్థం కానుంది. ఏపీ మంత్రి రావెల కిశోర్ పుత్రత్నం సుశీల్ తప్పతాగి పేద్ద కారు వేసుకొని రోడ్డు మీద పోయే మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించిన వీడియో ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది.

రోడ్డు మీద తన దారిన తాను వెళుతున్న ఒక మహిళను వెంబడించటం.. దాదాపు కిలో మీటరు వరకూ ఫాలో కావటం.. ఆ కారు.. అందులోని వ్యక్తుల్ని చూసి ఆమె భయపడటం లాంటి దృశ్యాలు స్పష్టంగా కనిపించటమే కాదు.. తనను తరుముకుంటూ వస్తున్న కారును తప్పించుకునేందుకు వడివడిగా వెళుతున్న వైనం వీడియో ఫుటేజ్ లో బయటకొచ్చింది.

ఇప్పటివరకూ బాధితురాలి వెర్షన్ మాత్రమే విన్న వారికి.. కంటి ముందుకు వీడియో దృశ్యాలు బయటకు రావటంతో ఎవరూ నోరు విప్పలేని పరిస్థితి. గతంలో పదవి.. అధికారం మాటున కొన్ని దుర్మార్గాలు సాగిపోయేవి. కానీ.. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావటంతో పాటు.. ఎక్కడికక్కడ సీసీ కెమేరాలు అమర్చిన నేపథ్యంలో.. రోడ్డు మీద ఏ చిన్న తప్పు అయినా అడ్డంగా బుక్ చేసే పరిస్థితి.

షాకింగ్ విషయం ఏమిటంటే.. తాజాగా బయటకు వచ్చిన సీసీ కెమేరాల్లోని ఫుటేజ్ చూసినప్పుడు.. మధ్యాహ్న వేళ.. స్కూలు పిల్లలు.. మహిళలు వెళుతున్న రోడ్డు మీదనే బరితెగించి.. ఒంటరి మహిళ వెంట పడిన వైనం చూసినప్పుడు సుశీల్ కామ వ్యవహారం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికే నిర్భయ చట్టం కింద కేసును నమోదు చేయగా.. మరోవైపు.. తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీ కెమేరా ఫుటేజ్ తో సుశీల్ అడ్డంగా బుక్ అయినట్లుగా చెబుతున్నారు.