Begin typing your search above and press return to search.

జయరాజ్ - బెన్నిక్స్ కేసులో సీసీ ఫుటేజ్ బయటకు.. ఖాకీలు బుక్

By:  Tupaki Desk   |   30 Jun 2020 11:00 AM IST
జయరాజ్ - బెన్నిక్స్ కేసులో సీసీ ఫుటేజ్ బయటకు.. ఖాకీలు బుక్
X
తమిళనాడులో ఖాకీల కర్కసత్వానికి బలమైన తండ్రికొడుకుల(జయరాజ్.. బెన్నిక్స్) ఉదంతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళ పోలీసుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాకీలకు కోపం వచ్చి ఒక షాపు యజమానులైన తండ్రికొడుకుల్ని కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేయటం.. వారి మరణానికి కారణం కావటం తెలిసిందే. ఇప్పటికే ఈ ఉదంతం ఎదురుదెబ్బలు తిన్న తమిళనాడు పోలీసులకు తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది.

లాక్ డౌన్ నిబంధనల్ని అతిక్రమిస్తూ.. షాపును తెరిచి ఉంచారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. షాపు బయట విపరీతమైన రద్దీ ఉందని.. లాక్ డౌన్ వేళ కావటంతో వారిని వెళ్లమని పోలీసులు చెబితే.. వారిపై తండ్రికొడుకులు బూతులు తిట్టినట్లుగా పోలీసులు చెప్పటం తెలిసిందే. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. విచారణలో వారు మరణించారు. విచారణ పేరుతో పోలీసులు పెట్టిన హింసకు వారిద్దరూ బలి అయ్యారన్న వాదన జోరు పెరిగింది. అమెరికాలో జరిగిన ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని పోలీసులు లేని నేరం చేసినట్లుగా అదుపులోకి తీసుకోవటం.. మెడ మీద కాలు పెట్టిన ఉదంతంలో మరణించటం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు బయటకురావటంతో అంత పెద్ద అమెరికా రగిలిపోయింది. పోలీసులు తీరుపైనా.. వివక్ష పైనా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఉదంతాన్ని గుర్తు చేసేలా తమిళనాడులో చోటు చేసుకున్న తండ్రికొడుకుల మరణం వివాదాస్పదంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటివరకూ పోలీసులు వినిపిస్తున్న వాదన తప్పుగా తేలింది. లాక్ డౌన్ వేళలో షాపు బయట పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నది నిజం కాదన్న విషయం తాజాగా బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. ఇందులో షాపు ముందు ఎవరూ లేకపోవటమే కాదు.. పరిసరాలు ఖాళీగా ఉండటం కనిపిస్తుంది.

షాపులోకి వెళ్లిన పోలీసులు జయరాజ్ తో మాట్లాడటం.. బయటకు వెళ్లటం.. తర్వాత వచ్చి అతడ్ని అదుపులోకి తీసుకోవటం లాంటివి చూస్తే.. ఎలాంటి కారణాలు లేకుండా అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి.. తండ్రికొడుకుల్ని దారుణంగా టార్చర్ పెట్టటంతో వారు ప్రాణాలు విడిచారు. ఈ ఉదంతంలో ఇప్పటివరకూ పోలీసులకు ఎదురైన ఎదురుదెబ్బలతో పోలిస్తే.. తాజాగా బయటకొచ్చిన సీసీ ఫుటేజ్ పోలీసు శాఖను ఆత్మరక్షణలో పడేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.