Begin typing your search above and press return to search.

కొత్త వైరస్ వచ్చిన వేళ.. ఏం చేయాలో చెప్పిన సీసీఎంబీ పెద్దమనిషి

By:  Tupaki Desk   |   29 Dec 2020 11:00 PM IST
కొత్త వైరస్ వచ్చిన వేళ.. ఏం చేయాలో చెప్పిన సీసీఎంబీ పెద్దమనిషి
X
కరోనానే దరిద్రం అనుకుంటే.. అంతకు మించి అన్నట్లుగా యూకే స్ట్రెయిన్ మారింది. దీని దెబ్బకు గ్రేట్ బ్రిటన్ తో పాటు.. ప్రపంచంలోని పలు దేశాలు ఆగమాగమైపోతున్నాయి. కంటికి కనిపించని సూక్ష్మంగా ఉండే కరోనా.. తన రూపాన్ని, తీరును మార్చుకున్న తీరు కొత్త విషయం కానప్పటికి.. బ్రిటన్ లో అది మారిన తీరు ప్రపంచానికి కొత్త తలనొప్పిగా మారింది. తనకున్న వేగానికి 60-70 శాతం వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఈ కొత్త వైరస్ భారత్ కు వచ్చేయటం.. తెలుగురాష్ట్రాల్లోని తెలంగాణలోకి వచ్చేసిన వైనాన్ని సీసీఎంబీ కన్ఫర్మ్ చేసింది.

బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 40 మందికి పాజిటివ్ రాగా.. వారి శాంపిళ్లను సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ సంస్థ విశ్లేషించింది. ఇప్పటికి 20 శాంపిళ్లను విశ్లేషించగా.. అందులో ముగ్గురికి యూకే వైరస్ సోకినట్లుగా గుర్తించారు. దీంతో.. ఇప్పుడు కొత్త గుబులు మొదలైంది. కొత్త వైరస్ ఎంతలా చుట్టుముడుతుందన్నది ఆందోళనగా మారింది. ఇలాంటివేళ సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా చెప్పిన మాటలు కొంత ఊరటగా మారాయి.

కొత్త రకం వైరస్ కనిపించటాన్ని ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదని.. ఆందోళన వద్దంటున్నారు. అయితే.. పెద్ద ఎత్తున పరీక్షలు జరపాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు. కొత్త రకం వైరస్ కు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. ఎందుకంటే కరోనా కారణంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో.. వీటితోనూ అవే సమస్యలు ఉంటాయంటున్నారు. కాకుంటే.. వ్యాప్తి మరింత వేగంగా ఉంటుందని.. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎవరికి వారు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఆందోళన కంటే.. అప్రమత్తత సరిపోతుందన్న సీసీఎంబీ డైరెక్టర్ మాటను పరిగణలోకి తీసుకుంటే.. కొత్త వైరస్ దూకుడుకు కళ్లాలు వేసే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.