Begin typing your search above and press return to search.

రెండేళ్ల తర్వాత సిటీలో ట్రాఫిక్ పోలీస్ ఉండరట

By:  Tupaki Desk   |   9 April 2016 5:53 AM GMT
రెండేళ్ల తర్వాత సిటీలో ట్రాఫిక్ పోలీస్ ఉండరట
X
ఈ మాట వినగానే వావ్ అన్న మాట నోటి నుంచి వస్తే తప్పులో కాలేసినట్లే. రోడ్ల మీద పోలీసులు ఉండకున్నా.. వారి కంటే మిన్నగా ప్రతి విషయాన్ని రికార్డు చేసే సీసీ కెమేరాలు వాహనదారుల్ని అనుక్షణం వెంటాడుతూనే ఉంటాయి. అయితే.. హైదరాబాద్ లాంటి మహా నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఉంటేనే నగర ట్రాఫిక్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది పోలీసులు రోడ్ల మీద ఉంటే జనాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించరా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసే లక్ష సీసీ కెమేరాల కారణంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని పోలీసు ఉన్నతాధికారులు భరోసా ఇస్తున్నారు.

ప్రతి కూడలి వద్ద ఏర్పాటు చేసే సీసీ కెమేరాలతో.. డేగ కన్ను వేసి ప్రతిది రికార్డు అవుతుంటే.. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసే వ్యవస్థ ఉండనుంది. దీంతో.. పోలీసులు రోడ్ల మీద లేకున్నా.. ట్రాఫిక్ ను కంట్రోల్ చేసే వీలుంటుంది. కంట్రోల్ రూమ్ నుంచే ట్రాఫిక్ ఇష్యూల్ని కంట్రోల్ చేయొచ్చన్న పోలీసు ఉన్నతాధికారుల మాట విన్న వెంటనే ఒక్క విషయంలో సంతోషం కలగటం ఖాయం.

అదేమంటే.. రోడ్ల మీద ట్రాఫిక్ ఎంత ఉందన్న విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా చలానాల కోసం వాహనాల్ని ఇష్టారాజ్యంగా ఆపేసి.. ట్రాఫిక్ ను మరింత ఇబ్బందికరగా మార్చే సన్నివేశాలు కనిపించవేమో. అంతేకాదు.. వాహనదారులే లక్ష్యంగా ఆ పేపర్లు ఉన్నాయా? ఈ పేపర్లు ఉన్నాయా? లాంటి ప్రశ్నలు వేసి.. లోగుట్టుగా చేయి చాచే అలవాటున్న అధికారులకు మాత్రం రానున్నవి గడ్డు రోజులనే చెప్పాలి.