Begin typing your search above and press return to search.

సీబీఎస్ఈ పరీక్షల్లో భారీ మార్పులు.. విద్యార్థులకు మేలేనా?

By:  Tupaki Desk   |   16 Feb 2020 10:00 AM IST
సీబీఎస్ఈ పరీక్షల్లో భారీ మార్పులు.. విద్యార్థులకు మేలేనా?
X
సీబీఎస్ఈ విధానం అంటే జాతీయ స్థాయి చదువులుగా భావిస్తున్నారు. ప్రస్తుతం సీబీఎస్ఈ విధానంలో తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఇష్ట పడుతున్నారు. సీబీఎస్ఈ విధానంలో చదివితే తమ పిల్లలు జాతీయ స్థాయిలో రాణిస్తారని, పోటీ పరీక్షల్లో సత్తా చాటుతారని అనుకుంటారు. ఆ విధంగా నమ్మకం ఏర్పడడంతో ఇప్పుడు సీబీఎస్ఈ విధానానికి బాగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం సీబీఎస్ఈ పరీక్షలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 20 వరకు కొనసాగుతున్నాయి. అయితే ఈసారి పరీక్ష నిర్వహణ లో భారీ మార్పులు చేశారు.

2017లో ప్రశ్నాపత్రం లీకేజీ రావడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దాన్నుంచి పాఠం నేర్చుకున్న సీబీఎస్ఈ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈసారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తోంది. పరీక్ష నిర్వహణలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ప్రశ్నాపత్రానికి క్యూఆర్ కోడ్ అమర్చారు. విద్యార్థి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుని పరీఓ కేంద్రానికి వస్తే అక్కడ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి విద్యార్థులను అనుమతిస్తున్నారు. ఈ కొత్త ప్రయోగం సత్ఫలితాలు ఇస్తోందో లేదో వేచి చూడాలి. దీంతో పాటు విద్యార్థి ఫొటో గుర్తింపు కోసం ప్రత్యేక విధానం తీసుకొచ్చారు. పరీక్ష కేంద్రంలో ఈ మేరకు పరీక్షల సూపరింటెండెంట్ పరీక్ష కేంద్రాలకు ఆ సామగ్రి తరలించారు. ప్రస్తుతం ప్రశ్నాపత్రాల సంఖ్య కూడా పెంచారు. 19 నుంచి 50కి పెంచారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 30 లక్షల మంది సీబీఎస్ఈ విధానంలో పది, 12వ తరగతి చదువుతున్నారు. వీరిలో పదో తరగతి 18,89,878 మంది ఉండగా, 12వ తరగతిలో 12,06,893మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సందర్భంగా సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి మాట్లాడుతూ.. ''విద్యార్థుల హాజరు శాతం నమోదుకు కొత్త పోర్టర్ విధానం తీసుకొచ్చాం. విద్యార్థుల ప్రాక్టీకల్స్ తో పాటు పరీక్షకు అనుసంధానం చేస్తుంది. అక్కడ ఉన్న విద్యార్థుల ఫొటోలే పరీక్షలో ఉన్నారా లేదా అనేది పరీక్ష నిర్వాహకులు, ఎక్జామినర్లు పరిశీలిస్తారు. సీబీఎస్ఈ తీసుకున్న కొత్త విధానం, సూచనలు, సలహాలు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం''.