Begin typing your search above and press return to search.

ఇప్పటికైనా మోడీ బాటలో నడుస్తారా జగన్?

By:  Tupaki Desk   |   2 Jun 2021 4:10 PM IST
ఇప్పటికైనా మోడీ బాటలో నడుస్తారా జగన్?
X
కరోనా వేళ కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం తెలిసిందే. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తప్పలేదన్న కేంద్ర ప్రబుత్వం.. పరీక్ష రాయాలనే విద్యార్థులకు అవకాశం ఇచ్చింది. అయితే.. ఇదంతా కరోనా నుంచి పరిస్థితులు మెరుగైన తర్వాత మాత్రమేనని స్పష్టం చేసింది. విద్యార్థుల ఆరోగ్యం.. భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన ప్రధాని మోడీ తాజాగా ప్రకటన విడుదల చేశారు.

పరీక్షల నిర్వహణ అంశాన్ని చర్చించటానికి భారీ సమావేశాన్ని ప్రధాని మోడీ నిర్వహించారు. దీనికి కారణంగా విద్యా శాఖా మంత్రి పోఖ్రియాల్ కోవిడ్ బారిన పడటం.. ఆయన కోలుకున్నప్పటికి అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయనీ సమావేశానికి హాజరయ్యారు. కరోనా వేళ.. పరీక్షల నిర్వహణ విషయంలో మిగిలిన రాష్ట్రాలకు భిన్నమైన వాదనను వినిపిస్తోంది జగన్ ప్రభుత్వం.

కాలం ఏదైనా సరే.. పరీక్షలు నిర్వహించటం తప్పదన్నట్లుగా ఏపీ సర్కారు మాట ఉండటం తెలిసిందే. విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టి లో పెట్టుకొనే పరీక్షల్ని నిర్వహిస్తామని.. వారికి మంచి కాలేజీలో సీటు రావాలంటే పరీక్షలు తప్పనిసరి అంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇప్పటికే పదో తరగతి పరీక్షలకు సంబంధించి సీబీఎస్ఈ రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. ఇరుగున ఉన్న తెలంగాణలోనూ పరీక్షల్ని రద్దు చేస్తూ నిర్ణయించారు. అయినప్పటికీ.. పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది జగన్ సర్కారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సరి కాదన్న మాటను పలు వర్గాలు చెబుతున్నాయి.

పరీక్షల్ని రద్దు చేయాలంటూ కోర్టును కూడా ఆశ్రయించటం తెలిసిందే. ఇలాంటివేళలోనే కేంద్రంలోని మోడీ సర్కారు తాజాగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటం.. తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఏపీలోని జగన్ ప్రభుత్వం కూడా ఈ తరహా నిర్ణయాన్ని తీసుకోవాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇప్పటికి విద్యార్థుల భవిష్యత్తు అన్న వాదనను వదిలేసి పరీక్షల్ని రద్దు చేస్తారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.