Begin typing your search above and press return to search.

అవినాష్ పై సీబీఐ అనుమానం..? వైసీపీకి రాజకీయంగా ఇది ఎదురుదెబ్బే!?

By:  Tupaki Desk   |   15 Feb 2022 5:55 AM GMT
అవినాష్ పై సీబీఐ అనుమానం..? వైసీపీకి రాజకీయంగా ఇది ఎదురుదెబ్బే!?
X
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఇందులో ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్ కుటుంబీకుల మీదనే సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా సీబీఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పలువురి పేర్లను పెట్టడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.

ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్న సమయం అది.. పైగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ జోరుగా ప్రచారం చేస్తున్న సమయంలో ఆయన సొంత బాబాయి వైఎస్ వివేకా హత్య జరగడం.. నాడు ఏపీ రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేసింది. అప్పటి నుంచి పలు కోణాల్లో ఈ కేసు చేతులు మారింది. ప్రస్తుతం సీబీఐ టేకప్ చేసింది.

తాజాగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కేవలం ఒక అనుమానితుడుగా మాత్రమే వైఎస్ అవినాష్ పేరు ఉందని కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే సీబీఐ ఎక్కడా అవినాష్ రెడ్డిని కన్ఫమ్ చేయలేదు.

కేవలం అనుమానం వ్యక్తం చేసింది అంతే.. దీనికి అంత ప్రాధాన్యం ఎందుకంటే ఏపీ సీఎం జగన్ కు వరుసకు అవినాశ్ రెడ్డి తమ్ముడు అవుతాడు. ఇక కడప ఎంపీ కూడా.. సో ఈ కేసు ఇప్పుడు వైసీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బగా పరిగణిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైఎస్ వివేకా తొలుత గుండెపోటుతో మరణించాడని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తప్పుడు ప్రచారం వెనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ చార్జ్ షీట్ లో అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామం ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తోపాటు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. రాజకీయంగా వైసీపీకి ఎదురుదెబ్బగా పరిణమించిందని అంటున్నారు.

ఇప్పటికే వైఎస్ వివేకా కుమార్తె సునీత కూడా తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మరో చిన్నాన్న మనోహర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేర్లను మైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో అనుమానితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సీబీఐ కూడా అనుమానం వ్యక్తం చేయడంతో ఇది రాజకీయంగా జగన్ సర్కార్ ను ఇబ్బందుల్లో పడేసినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.