Begin typing your search above and press return to search.

పోస్టులు తొలగించిన సీబీఐ!

By:  Tupaki Desk   |   3 Sept 2021 11:00 PM IST
పోస్టులు తొలగించిన సీబీఐ!
X
రాష్ట్ర హైకోర్టులో పనిచేస్తున్న కొందరు జడ్జీలపై పోయిన ఏడాది సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతరకర పోస్టులను తొలగించినట్లు సీబీఐ అధికార ప్రతినిధి ఆర్కే జోషి తెలిపారు. ఓ కేసు సందర్భంగా పోయిన ఏడాది కొందరు జడ్జీలపై వైఎస్సార్సీపీ మద్దతుదారులు, కొందరు అభిమానులు అనుచితమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఫేస్ బుక్, వాట్సప్ తదితర సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పార్టీ నేతలతో పాటు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే సుమారు 50 మంది అభ్యంతరకమైన పోస్టులు పెట్టారు.

తమపై అనుచితమైన పోస్టులు పెట్టడాన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు మొత్తం వ్యవహారాన్ని విచారించమని సీఐడీని ఆదేశించింది. అయతే ఎంత కాలమైనా సీఐడీ విచారణ ముందుకు సాగకపోవటంపై అసంతృప్తి వ్యక్తంచేస్తు విచారణ బాధ్యతనుండి సీఐడీని తప్పించింది. వెంటనే విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించింది. దీనిపైన కూడా సోషల్ మీడియాలో మళ్ళీ అనుచితమైన పోస్టింగులు కనిపించాయి.

అప్పటి నుండి కేసును విచారిస్తున్న సీబీఐ ఇఫ్పటికే కడప జిల్లా పులివెందులకు చెందిన లింగారెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసింది. కువైట్ నుండి పులివెందులకు వచ్చిన లింగారెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుని తర్వాత జ్యుడీషియల్ రిమాండ్ కు పంపింది. తర్వాత లింగారెడ్డి లాగే ధనిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్ అనే ఇద్దరిని కూడా జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. వీరు కాకుండా సీబీఐ మరో 13 మందిని గుర్తించింది. కాకపోతే వారిలో చాలామంది విదేశాల్లో ఉంటున్నారు.

ఈ కేసులో విచారణను పూర్తిచేసిన సీబీఐ గురువారం నాడు ఛార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 16 మందిపైనా సీబీఐ 153 ఏ, 503, 505 (2), 506 సెక్షన్ల క్రింద కేసులు నమోదుచేసింది. పనిలో పనిగా వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇన్చార్జి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిని కూడా విచారించింది. కాకపోతే ప్రభుత్వ పోస్టులో ఉన్న కారణంగా సీబీఐ దేవేందర్ ను అరెస్టు చేయలేకపోయింది. మొత్తానికి జడ్జీలపై అనుచితమైన పోస్టుల ఉదంతం సంచలనంగా మారిందనే చెప్పాలి.