Begin typing your search above and press return to search.

రఘురామ అసలు లెక్కలు విప్పి చెప్పిన సీబీఐ ప్రకటన!

By:  Tupaki Desk   |   9 Oct 2020 1:00 PM IST
రఘురామ అసలు లెక్కలు విప్పి చెప్పిన సీబీఐ ప్రకటన!
X
నోటితో నీతులు చెప్పటానికి మించిన తేలికైన పని మరింకేమీ ఉండదు. ఏపీ అధికార పార్టీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సంబంధించిన గుట్టురట్లను బయటపెట్టింది సీబీఐ విడుదల చేసిన అధికారిక ప్రకటన. గురువారం మహారాష్ట్రతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయనకు చెందిన ఆఫీసుల్లో సిబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు ఇళ్లు.. ఆఫీుసుల్లోనూ సీబీఐ అధికారుల హడావుడి కనిపించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ లు స్కోలింగుల రూపంలో చానళ్లలో వస్తే.. సీబీఐ అధికారుల తనిఖీలు ఏమీ జరగట్లేదంటూ ఆయన పదే పదే ఖండించారు.

దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం తర్వాత సీబీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అప్పటివరకు మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లే.. ఎంపీ రఘురామకు చెందిన ఆస్తుల మీద తనిఖీలు నిర్వహించినట్లుగా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేనా.. కళ్లు చెదిరేలా..నోట మాట రాని విధంగా షాకిచ్చే పలు అంశాల్ని అందులో ప్రస్తావించారు. ఆరోపణలు దట్టించిన ఆ ప్రకటన తర్వాత ఎంపీ రఘురామ మారు మాట్లాడకపోవటం గమనార్హం.

ఇంతకీ రఘురామ మీద ఉన్న ప్రధాన ఆరోపణ చూస్తే.. జాతీయ బ్యాంకుల నుంచి వందలాది కోట్ల రూపాయిల్ని అప్పుగా తీసుకొనటం ఒక ఎత్తు అయితే.. వాటికి ఇప్పటివరకు కనీసం వడ్డీ కూడా చెల్లించని వైనాన్ని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ నిధుల్ని అక్రమంగా తనకు చెందిన వారి ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసం చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా మళ్లించిన మొత్తం దాదాపు రూ.800 కోట్లకు పైనే ఉండటం గమనార్హం.
మూడు రాష్ట్రాల్లో గురువారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు ఏక కాలంలో పదకొండుచోట్ల తనిఖీలు నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. సీబీఐ ప్రకటనలో పేర్కొన్న ప్రధాన అంశాల్ని చూస్తే..

- పంజాబ్ నేషనల్ బ్యాంక్.. దాని అనుబంధ బ్యాంకుల నుంచి రూ.826.17 కోట్ల మొత్తాన్ని ఇండ్ - భారత్ థర్మల్ పవర్ పేరుతో అప్పు తీసుకున్నారు. ఆ రుణాన్ని పక్కదారి పట్టించారు. ఆ రుణానికి సంబంధించిన వడ్డీని ఇప్పటివరకు చెల్లించలేదు.

- బ్యాంకు దగ్గర రుణం తీసుకున్నప్పుడు గ్యారెంటీ కింద కొన్ని భూముల్ని పెడతారు. అలాంటి భూముల్ని అమ్మేశారు. ఇలా అమ్మేయం మోసం చేయటమే.

- 95 శాతం బొగ్గు తగ్గిపోయిందని.. దాన్ని తగలబెట్టేశారు

- కర్ణాటకలోని తమ పవర్ ప్రాజెక్టుకు రుణం కావాలని అప్లికేషన్ పెట్టారు. ఇండ్ - భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో పెట్టిన ఈ ప్లాంట్ కు పర్యావరణ అనుమతులు రాలేదు. దీంతో.. దాన్ని తమిళనాడుకు షిఫ్ట్ చేశారు. దీనికి సంబంధించి తీసుకున్న మొత్తాల్ని బ్యాంకులకు తిరిగి చెల్లించలేదు.

- ఎంపీ రఘురామ రాజు.. ఆయన సతీమణి.. కుమార్తె మీద కేసులునమోదు చేశారు. నిందితులు అప్పులు ఎగ్గొట్టి న్యాయ విచారణ నుంచి తప్పించుకోవటానికి దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని వారికి అప్పు ఇచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కంప్లైంట్ లో ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎంపీ రఘురామ మాష్టారు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఆయనకు చెందినట్లుగా చెబుతున్న పలు కంపెనీలు బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నాయి. ఇండ్ - భారత్ పేరు పక్కన ఎనర్జీ.. పవర్.. థర్మల్.. ఇలా చాలాపేర్లతో ఉన్న కంపెనీల్లో కలిపి దగ్గర దగ్గర రూ.23వేల కోట్ల మేర అప్పులు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇవన్నీ రఘురామ వ్యక్తిగత అప్పులుగా చెప్పలేం. ఇవన్నీ ఆయనకు సంబంధం ఉన్న కంపెనీల అప్పులుగా చెప్పాలి. వీటిల్లో చాలావరకు నష్టాల పాలై.. దివాళ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఆరోపణలు. నిత్యం నీతులు చెప్పే రఘురామ మాష్టారు మరీ ఇంత ముదురా? అన్న క్వశ్చన్ పలువురి నోట వినిపిస్తోంది.


Source : Sakshi