Begin typing your search above and press return to search.

సీఎంపై సీబీఐ విచారణ.. కోర్టు ఆదేశం

By:  Tupaki Desk   |   17 Feb 2019 4:34 AM GMT
సీఎంపై సీబీఐ విచారణ.. కోర్టు ఆదేశం
X
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకొని ప్రతిపక్ష ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ను సీబీఐతో జైలు పాలు చేశారు నితీష్. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఆయనకు కోర్టులో చుక్కెదురైంది.

తాజాగా బీహార్ సీఎంపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించింది. వసతి గృహాల్లో బాలికలపై అత్యాచారం కేసులకు సంబంధించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై విచారణ జరపాలని ‘పోస్కో’ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నితీష్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ధర్మేంద్ర సింగ్, అతుల్ ప్రసాద్ లపై సీబీఐ విచారణ జరగనుంది.

*కేసు పూర్వాపరాలివీ..
బీహార్ లోని ముజఫర్ పూర్ వసతి గృహంలో జరిగిన ఘోరాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్జీవో బ్రజేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో నడిచిన షెల్టర్ హోంలో ఉన్న 40మంది బాలికలు అత్యాచారానికి గురయ్యారని అప్పట్లో నివేదికలో బట్టబయలైంది. బీహార్ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో అప్పట్లో మంత్రిగా ఉన్న మంజూవర్మ భర్త ప్రమేయం కూడా ఉందని వార్తలు రాగా మంత్రి మంజూ రాజీనామా చేశారు. అయితే ఈ కేసును బీహార్ ప్రభుత్వం పట్టించుకోకుండా నీరుగార్చిందనే ఆరోపణలున్నాయి. నితీష్ సర్కారు దోషులను తప్పించేందుకు ప్రయత్నించిందన్న వార్తలొచ్చాయి.. దీనిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ అధికారి శర్మను బదిలీ చేయడాన్ని కూడా సుప్రీం తప్పుపట్టింది. దీనిపై అఫిడవిట్ సమర్పించాలని బీహార్ సర్కారును ఆదేశించింది. బదిలీ చేసిన సీబీఐ ఉన్నతాధికారిని కోర్టు ధిక్కరణ కింద లక్ష జరిమానా విధించి కోర్టులో నిలబెట్టింది.

ఇప్పుడు తాజాగా బీహార్ సీఎంపై కూడా సీబీఐ విచారణకు ఈ కేసులో కోర్టు ఆదేశాలిచ్చింది. నైతిక బాధ్యతగా దీన్ని భావించి నితీస్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కానీ నితీష్ మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో.. కేంద్రంలో బీజేపీ-జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం ఉండడంతో సీబీఐ విచారణలో కూడా నితీష్ ను సేఫ్ చేస్తారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.