Begin typing your search above and press return to search.

అఖిలేశ్‌ చుట్టూ బీజేపీ ఉచ్చు..సీబీఐ దాడుల టార్గెట్ ఆయనేనా?

By:  Tupaki Desk   |   5 Jan 2019 5:05 PM GMT
అఖిలేశ్‌ చుట్టూ బీజేపీ ఉచ్చు..సీబీఐ దాడుల టార్గెట్ ఆయనేనా?
X
ఉత్తరప్రదేశ్ లో సీబీఐ జూలు విదిల్చింది. మొత్తం 12 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని ఎస్పీ - బీఎస్పీలు నిర్ణయించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడులు ప్రారంభం కావడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎస్పీ నేత - యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ పైనా సీబీఐ యాక్షన్ ఉండొచ్చన్న సూచనలు కనిపిస్తున్నాయి.

మైనింగ్ స్కామ్ కు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లుగా సీబీఐ చెబుతోంది. అయితే... 2017లో దీనికి సంబంధించి ప్రాథమికంగా ఎఫ్ ఐఆర్ లు సిద్ధం చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు ఎస్పీ - బీఎస్పీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన కొద్దిగంటల్లోనే యాక్షన్ మొదలవడంతో దీని వెనుక రాజకీయ కారణాలున్నట్లు అంచనా వేస్తున్నారు.

ఎఫ్ ఐఆర్ లో అఖిలేష్ యాదవ్ పేరును నిందితుల జాబితాలో చేర్చనప్పటికీ... పలుమార్లు ఆయన పేరును ప్రస్తావించారు. 2012-13లో ఉత్తరప్రదేశ్ మైనింగ్ శాఖకు అఖిలేష్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయనతో పాటు గాయత్రి ప్రజాపతి మైనింగ్ శాఖను నిర్వహించారు. ప్రస్తుత ఎఫ్ఐఆర్ లో ఎస్పీ ఎమ్మెల్సీ రమేష్ కామత్ మిశ్రా - బీఎస్పీ నేత సంజయ్ దీక్షిత్ - ఐఏఎస్ అధికారి బూక్యా చంద్రకళతో పాటు మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఛార్జ్ షీట్లు నమోదయ్యే అవకాశం ఉంది. వీటిలో అఖిలేష్ ను నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.