Begin typing your search above and press return to search.

ఎందుకు పదే పదే నోటీసులిస్తోంది ?

By:  Tupaki Desk   |   17 Oct 2022 12:05 PM IST
ఎందుకు పదే పదే నోటీసులిస్తోంది ?
X
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ప్రత్యర్ధులను సీబీఐని అడ్డుపెట్టుకుని బీజేపీ వేధిస్తోందని ఆరోపణలు చేయటానికి ప్రతిపక్షాలకు బాగా అవకాశాలు ఇస్తోంది. తాజాగా ఢిల్లీ ఆప్ ప్రభుత్వం ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీచేసింది. 17వ తేదీన అంటే సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో విచారణకు రావాలని నోటీసులో స్పష్టంచేసింది.

తాజా నోటీసుతోనే అందరికీ సీబీఐ వైఖరిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇదే విషయమై సీబీఐ రెండుసార్లు సిసోడియాను విచారించింది. ఒకసారి ఆఫీసులోనే ఆయన్ను విచారించింది.

రెండోసారి ఆయన ఆపీసు, ఇల్లు, ఆయన గ్రామంలోని సొంతింటితో పాటు ఢిల్లీలోని ఆయన బ్యాంకు లాకర్లను కూడా సోదాలు చేసింది. ఎంత వెదికినా, ఎంతగా సోదాలు చేసినా సీబీఐకి ఏమీ అనుమానస్పదంగా దొరకలేదు. ఈ విషయాన్ని సీబీఐ స్వయంగా చెప్పింది.

మరి మూడోసారి మళ్ళీ ఎందుకని మనీష్ ను విచారణకు రమ్మందో ఎవరికీ అర్ధంకావటంలేదు. రెండుసార్లు ఏమీ దొరకకపోయినా మళ్ళీ మూడోసారి విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వటంతోనే మనీష్ ను సీబీఐ వేధింపులకు గురిచేస్తోందనే అరోపణలకు బలం చేకూరింది.

ఇలాంటి నోటీసులు ఒక్క సిసోడియాకు మాత్రమే కాదు చాలా రాష్ట్రాల్లో చాలామందికి ఇచ్చింది. పశ్చిమబెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తెలంగాణాలోని చాలామంది ప్రతిపక్షాల నేతలకు సీబీఐ లేదా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులిచ్చి విచారణకు పిలిచి గంటల తరబడి కూర్చోబెడుతున్నాయి.

తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, టీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉన్నవారు, ఆర్జేడీ పార్టీలకు చెందిన ఇప్పటికే చాలామందికి నోటీసులివ్వటం, కొందరినీ అరెస్టులు చేయటం అందరికీ తెలిసిందే. కారణాలు ఏమైనా కానీ పదే పదే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలవెంట దర్యాప్తు సంస్ధలు పడుతున్నాయి. మరి చివరకు ఏమి తేలుతుందో ఏమో చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.