Begin typing your search above and press return to search.

సీబీఐ , ఎన్‌ఐఏ దర్యాప్తు అక్కర్లేదు ... సిట్‌ దర్యాప్తు సాగుతోంది !

By:  Tupaki Desk   |   26 Jan 2021 12:00 PM IST
సీబీఐ , ఎన్‌ఐఏ  దర్యాప్తు అక్కర్లేదు ... సిట్‌ దర్యాప్తు సాగుతోంది !
X
ఏపీలో గత కొన్ని రోజులుగా క్రితం వరుసగా పలు ఆలయాల పై దాడులు జరిగినట్టు ప్రముఖ ప్రసారమాధ్యమాల్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రామతీర్థం ఘటన రాజకీయంగా రాష్ట్రంలో కాక రేపింది. ఈ దాడులపై సీబీఐ లేదా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ ఐఏ) లతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందిన లెక్చరర్‌ కె.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాష్ట్ర హైకోర్టు పరిష్కరించింది. దేవాలయాలపై దాడులకు సంబంధించి సిట్‌ దర్యాప్తు సాగుతున్నందున ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు అవసరంలేదని హైకోర్టు తెలిపింది.

సిట్‌ దర్యాప్తు ముగియకముందే సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయడం అపరిపక్వమే అవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత దశలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, ఈ దశలో న్యాయస్థాన జోక్యం కూడా అవసరం లేదని ,ఒకవేళ సిట్‌.. దేవాలయాలపై దాడులకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో విఫలమైతే అప్పుడు కోర్టుకు రావచ్చని పిటిషనర్‌ కు తెలియజేసింది. ఈ దాడుల కేసు దర్యాప్తును సిట్‌ ఓ తార్కిక ముగింపునకు తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తూ పిల్ ‌ను పరిష్కరించింది.

అంతకుముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీఎస్ ‌పీ సురేశ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఆలయాలపై తరచు దాడులు జరుగుతున్నాయని, విగ్రహాల ధ్వంసం జరుగుతోందని అన్నారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం తగులబెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో దేవతామూర్తి విగ్రహం నుంచి తలను వేరుచేశారని, దీనిపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. రథం దగ్ధం కన్నా రామతీర్థం ఘటన తీవ్రమైనదని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఆలయాలపై దాడులను తీవ్రంగా పరిగణిస్తోందని, అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు.