Begin typing your search above and press return to search.

స‌బిత‌, ధ‌ర్మాన‌కు మ‌రోసారి జ‌గన్ షాక్‌

By:  Tupaki Desk   |   31 July 2016 8:16 AM GMT
స‌బిత‌, ధ‌ర్మాన‌కు మ‌రోసారి జ‌గన్ షాక్‌
X
ప‌నిగాడొదిలినా.. శ‌నిగాడొద‌ల్లేద‌న్న‌ట్టుంది వైఎస్ జ‌మానాలో మంత్రులుగా ప‌నిచేసిన స‌బితా ఇంద్రారెడ్డి - ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ప‌రిస్థితి! 2008లో వైఎస్ తెర‌చాటు ఆదేశాల నేప‌థ్యంలో వారు తీసుకున్న నిర్ణ‌యాలు ఇప్పుడు వారిని వెంటాడుతూ వేధింపుల‌కు గురిచేస్తున్నాయి. నాక‌ది.. నీకిది త‌ర‌హాలో కొంద‌రికి ల‌బ్ధి చేకూర్చి.. ఆయా సంస్థ‌లు ప‌రోక్షంగా వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ స్థాపించిన సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టేలా మంత్రులు నిర్ణ‌యాలు తీసుకున్నార‌నేది సీబీఐ ఆరోప‌ణ‌లు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ప‌లు చార్జ్ షీట్లు దాఖ‌లు చేసి - మంత్రులు - ఐఏఎస్ అధికారుల‌కు ఊపిరాడ‌కుండా చేసిన సీబీఐ వ‌ర్గాలు తాజాగా అప్ప‌టి గ‌నుల శాఖ మంత్రి స‌బితా ఇంద్రా రెడ్డి స‌హా రెవెన్యూశాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుల‌పై అనుబంధ చార్జ్ షీట్లు దాఖ‌లు చేశాయి.

సున్నపురాయి నిక్షేపాల లీజుల కేటాయింపులో పెన్నా సిమెంట్స్ కు అనుకూలంగా వ్యవహరించారనే అభియోగంతో ఈ ఛార్జిషీట్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా తాండూరు - అనంతపురం జిల్లా యాడికి - కర్నూలు జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా పెన్నా సిమెంట్స్‌ కి మైనింగ్‌ కేటాయింపులు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఆయా విష‌యాల‌నే చార్జ్ షీట్ల‌లో పేర్కొంది. 2008లో తాండూరులో 1021 ఎకరాల మైనింగ్‌ లీజులను పునరుద్ధరించాలని వాల్‌ చంద్‌ కంపెనీ దరఖాస్తు చేసుకోగా అందుకు నిరాకరించిన వైఎస్‌ సర్కారు.. వాల్‌ చంద్‌ కంపెనీని పెన్నా సిమెంట్స్‌ కొనుగోలు చేయగానే ఈ లీజులను పునరుద్ధరించింది.

అదేవిధంగా కర్నూలు జిల్లాలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీని కాదని పెన్నా సిమెంట్స్‌ కంపెనీకి 760 ఎకరాలు - అనంతపురంలోని యాడికిలో 230 ఎకరాల అసైన్డ్ భూములను వైఎస్‌ ప్రభుత్వ కేటాయించింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ లీజుల కేటాయింపులకు ప్రతిఫలంగా సీఎం తనయుడు జగన్ కంపెనీల్లో పెన్నా గ్రూప్‌ రూ.68 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ఇవే స‌బిత‌ - ధర్మాన స‌హా రెవెన్యూ శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శామ్యూల్‌ - మైనింగ్‌ శాఖ మాజీ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌ తదితరులపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇలా స‌బిత‌ - ధ‌ర్మాన‌ను వ‌ద‌ల బొమ్మాళి అని వెంటాడుతున్నాయి జ‌గ‌న్ కేసులు. ఇదిలావుంటే, సీబీఐ చార్జ్ షీట్లు ఎదుర్కొంటున్న ధ‌ర్మాన ప్ర‌స్తుతం జ‌గ‌న్ పార్టీ వైకాపాలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం.