Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ చేతికి తుపాకీ ఇచ్చిన సీబీఐ

By:  Tupaki Desk   |   21 Dec 2017 2:21 PM GMT
కాంగ్రెస్ చేతికి తుపాకీ ఇచ్చిన సీబీఐ
X
ఆరేడేళ్లుగా సాగుతున్న 2జీ కుంభకోణం కేసు ఒక కొలిక్కి వ‌చ్చేసిన‌ట్లే. ఈ కేసులో ప్ర‌ధాన నిందితులుగా పేర్కొన్న వారిలో అత్యంత ప్ర‌ముఖులైన డీఎంకే అధినేత కుమార్తె కనిమొళి.. మాజీ కేంద్ర టెలికాం మంత్రి రాజాలు సుద్ద‌పూస‌లుగా తేల్చేసింది. వారిపై వ‌చ్చిన ఆరోప‌ణల్ని నిరూపించే విష‌యంలో ఫెయిల్ కావ‌టంతో సీబీఐ ప్ర‌త్యేక కోర్టు వీరిద్ద‌రిని నిర్దోషులుగా తేల్చేసింది. ఈ తీర్పుపై పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజా తీర్పు కాంగ్రెస్ పార్టీకి కొండంత బ‌లంగా మారింది. తీర్పు వెలువ‌డిన వెంట‌నే స్పందించిన మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ త‌న ప్ర‌భుత్వ హ‌యాంలో ఏమీ జ‌ర‌గ‌లేద‌ని.. కుట్ర‌పూరితంగా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసి తమ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసిన‌ట్లుగా విమ‌ర్శించారు.

ఏం జ‌రిగినా పెద్ద‌గా రియాక్ట్ కాని మ‌న్మోహ‌న్ సింగ్ అంత‌లా స్పందించిన త‌ర్వాత మిగిలిన వారు మాట్లాడ‌కుండా ఉంటారా? అందుకే.. ఎవ‌రికి వారు స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ ఆస‌క్తిక‌ర‌మైన వాద‌న‌ను తెర మీద‌కు తెచ్చింది. 2జీ కుంభ‌కోణం కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో.. ఈ వ్య‌వ‌హారానికి అస‌లు కార‌ణ‌మైన మాజీ కంప్ట్రోల‌ర్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ వినోద్ రాయ్ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. ఆయ‌న తీరు కాగ్ చ‌రిత్ర‌లో మ‌చ్చ‌గా మారుతుంద‌ని కాంగ్రెస్ మండిప‌డుతోంది.

వినోద్ రాయ్ చేసిన ప‌నికి మాజీ కాగ్ అధినేత ఏ స్థాయిలో ప్ర‌తిఫ‌లం పొందుతున్నారో ఇప్పుడు అంద‌రూ చూస్తున్నార‌ని.. ఆయ‌న మోడీ ప్ర‌భుత్వానికి బ‌ల‌మైన స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఆరోపించారు. వినోద్‌ రాయ్ తీరు కాగ్ చ‌రిత్ర‌లో మ‌చ్చ‌గా మారుతుంద‌ని.. ఆయ‌న్ను ద‌ర్యాప్తు సంస్థ‌లు వెంట‌నే ప్రాసిక్యూట్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

2జీ స్కాంతో దేశ ఖ‌జానాకు రూ.1.78 ల‌క్ష‌ల కోట్లు న‌ష్టం వాటిల్లిన‌ట్లుగా ఆయ‌న పేర్కొన‌టంతో పెద్ద దుమారం రేగ‌టం తెలిసిందే. 2జీ స్కాం మీద ఎప్పుడూ డిఫెన్స్ లో ప‌డే కాంగ్రెస్ తాజగా సీబీఐ కోర్టు తీర్పుతో గొంతు తీవ్రం కావ‌ట‌మే కాదు.. కొత్త శ‌క్తితో మండిప‌డుతోంది. మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్ చేతికి సీబీఐ తీర్పు భారీ తుపాకీగా మారింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.