Begin typing your search above and press return to search.

జగన్ యాత్రకు మోకాలడ్డుతున్నారు!

By:  Tupaki Desk   |   14 Oct 2017 4:21 AM GMT
జగన్ యాత్రకు మోకాలడ్డుతున్నారు!
X
జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ పాదయాత్ర లో రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలనే ప్రజల ఆకాంక్షను ఆయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు గట్టిగా వినిపించదలచుకుంటున్నారు. అలాగే చంద్రబాబు సర్కారు పాలన వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం జగన్ చేస్తారు. అయితే ఇలాంటి లక్ష్యాలతోసాగే పాదయాత్ర అసలంటూ జరగనే కూడదని పార్టీ వర్గాలు ఆశించడం, అందుకు రకరకాల ప్రయత్నాలు చేయడం సహజం. కానీ.. రాజకీయ కారణాలు కాకపోయినప్పటికీ.. ఆయన పాదయాత్రకు మోకాలడ్డి అసలంటూ అనుమతి రాకుండా ఆపేయడానికి మరోవైపు నుంచి సీబీఐ కూడా తనవంతుగా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

చట్ట పరిధిలో... అసలు జగన్ పాదయాత్రకు అనుమతి ఇవ్వడానికే వీల్లదేని వాదిస్తూ..సీబీఐ కోర్టులో వారు కౌంటర్ దాఖలు చేశారు. జగన్ తనకు ఆరునెలలపాటూ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతోంటే.. అసలు పాదయాత్రకే అనుమతి ఇవ్వరాదని... సీబీఐ వాదించడం చిత్రమైన పరిణామం. కోర్టు అనుమతి అడగకుండానే పాదయాత్ర గురించిన ప్రకటన చేశారంటూ జగన్మోహనరెడ్డి పై సీబీఐ ఆరోపణలు చేస్తోంది.

అయితే నిజానికి జగన్మోహనరెడ్డికి ప్రస్తుతం బెయిలు మీద ఉన్న అనుమతుల రీత్యా చూసినా.. తాను చేయదలచుకున్న ప్రతిపనికీ ప్రతిసారీ కోర్టును అనుమతి అడగాల్సిన అవసరం సాంకేతికంగా లేదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. దేశం విడిచి వెళ్లేప్పుడు కోర్టుకు ముందుగా తెలియజేయాలే తప్ప.. ఇక్కడి కార్యక్రమాల విషయంలో ప్రతిసారీ ముందస్తు అనుమతి అడగాల్సిన పని లేకుండా కోర్టు ఇదివరకే అనుమతి ఇచ్చిందని అంటున్నారు. అయితే ఈ దఫా చేయదలచుకున్న పాదయాత్రకు మాత్రం ఇన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి.

మామూలుగా అయితే సీబీఐ చట్ట ప్రకారం కోర్టు తనను ఎంతవరకు అడిగితే అంతవరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినా సరిపోతుంది. అయితే వారు ఇంకో అడుగు ముందుకేసి.. అసలు పాదయాత్రకు అనుమతి ఇవ్వడం కూడా సరికాదన్నట్లుగా వాదిస్తున్నారు. కోర్టును అడగకుండా పాదయాత్రను ప్రకటించడం, కోర్టును అగౌరవపరచడమే అంటూ.. జగన్ కు లేని ఉద్దేశాలను ఆపాదిస్తూ.. ఆ రకంగా కోర్టు తీర్పును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా సీబీఐ అఫిడవిట్ ఉన్నదని కూడా కొందరు వాదిస్తున్నారు.