Begin typing your search above and press return to search.

వైసీపీ మీద సీబీఐ కుట్ర... వెనక ఉన్నదెవరు... ?

By:  Tupaki Desk   |   15 Feb 2022 10:00 PM IST
వైసీపీ మీద సీబీఐ కుట్ర... వెనక ఉన్నదెవరు... ?
X
ఏపీలో ఇపుడు అతి పెద్ద టాపిక్ గా మాజీ మంత్రి వికేకానందరెడ్డి హత్య కేసు ఉంది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో లేటెస్ట్ గా సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ని ఆధారం చేసుకుని కొన్ని ఊహాగానాలు ప్రచారం లోకి వచ్చేశాయి.

అవి ఎవరు చేస్తున్నారు అన్నది పక్కన పెడితే ఈ హత్య కేసు విషయంలో వైసీపీని టార్గెట్ చేసేలా కొన్ని శక్తులు చూస్తున్నాయి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తరువాత జగన్ బాగా కృంగిపోయారని ఆయన అన్నారు. ఇక చార్జిషీటులో లేని అంశాలను కూడా ముందుకు తెచ్చి కొన్ని మీడియా చానళ్ళు హడావుడి చేస్తున్నాయని ఆయన విమర్శించారు. వివేకానందరెడ్డికి, అవినాష్ రెడ్డి కి మధ్య విభేధాలు ఉన్నట్లుగా చెబుతున్నారని, నిజానికి అవినాష్ జెంటిల్మెన్ అని సజ్జల అన్నారు.

కేవలం కొందరికి ఉపయోగపడేలా ఈ విష ప్రచారానికి తెర తీశారని ఆయన అన్నారు.అదే విధంగా అవినాష్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో హత్య జరగడానికి ముందు వివేకానందరెడ్డి పాల్గొన్నారు అని ఆయన గుర్తు చేశారు. సీబీఐ అధికారులు కూడా కొందరు ప్రముఖుల పేర్లు చెప్పమని నిందితుల మీద వత్తిడి తీసుకువస్తున్నారు అని కూడా సజ్జల ఆరోపించడం విశేషం.

మరో వైపు సీబీఐ ఈ కేసు విషయంలో వైసీపీని ఇరుకున పెట్టాలని ఒక పధకం ప్రకారం కుట్ర చేస్తోంది అని సజ్జల ఆరోపిస్తున్నారు. నాడు వివేకా హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం అని ఆయన పేర్కొంటున్నారు.

మొత్తానికి చూస్తే మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైసీపీ వెర్షన్ ఆయన చెప్పినా ఏదో తమ వెనక కుట్ర జరుగుతోంది అని చెప్పడమే చర్చనీయాంశం అవుతోంది.

సీబీఐ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. మరి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. సీబీఐ అధికారులు విచారణ చేస్తారు కానీ ఎవరో ఒకరిని ఇరికించాలని అనుకోరు. ఒకవేళ అలా చేయాలనుకున్నా వైసీపీ నేతలు అధికారంలో ఉన్నారు. బలంగా ఉన్నారు.

మరి ప్రభుత్వానికే ఇబ్బంది పెట్టేలా వారు చేయగలరా. అలా చేయాలనుకుంటే సీబీఐ అధికారుల ఒక్కరికే వీలు అవుతుందా. అంటే సీబీఐ కుట్ర చేస్తోంది అని సజ్జల అంటున్న మాటలు, చేస్తున్న ఆరోపణలు ఎవరి మీద అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. చూడాలి మరి కుట్ర కధల వెనక ఎవరున్నారో.