Begin typing your search above and press return to search.

సిలికాన్ వ్యాలీ ‘ఫార్మల్’ అయిపోయింది

By:  Tupaki Desk   |   27 Sep 2015 7:10 AM GMT
సిలికాన్ వ్యాలీ ‘ఫార్మల్’ అయిపోయింది
X
సాదాసీదా ఉద్యోగి నుంచి కంపెనీ సీఈవో వరకూ అందరూ క్యాజువల్ గా ఉంటారు. ఎవరు ఎక్కువ.. ఎవరు తక్కువన్న యవ్వారమే ఉండదు. ప్రపంచ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సిలికాన్ వ్యాలీలో ఈ వీకెండ్ సీన్ మొత్తం మారిపోయింది. ఎప్పుడూ క్యాజువల్స్ తో పిచ్చ క్యాజువల్ గా ఉండే టెక్కీలంతా చాలా సీరియస్ గా ఫార్మల్ లోకి మారిపోయారు.

వీకెండ్ సమయంలో తమ వద్దకు వస్తున్న ఒక వీవీఐపీ కోసం ఈ భారీ మార్పు చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్రమోడీ.. 33 ఏళ్ల తర్వాత సిలికాన్ వ్యాలీకి వస్తున్న నేపథ్యంలో.. టెకీలంతా తమ క్యాజువల్స్ ను వదిలేసి.. ఫార్మల్ గా తయారై నీటుగా సూటుబూటు వేసుకొన్నారట.

అంతేకాదు.. తమ దగ్గరకు వస్తున్న భారత ప్రధానిని ఘనంగా స్వాగతం పలికేందుకు వీలుగా.. ప్రత్యేకంగా ఒక రెడ్ కార్పెట్ ఒకటి తయారు చేయించారట. 5 అడుగుల వెడల్పుతో.. 30 అడుగుల పొడుగుతో తయారు చేయించిన ఈ రెడ్ కార్పెట్ ను కాలిఫోర్నియాలోని మినేటా శాన్ జోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రత్యేకంగా ఉంచారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అమెరికాలో తొలిసారి పర్యటిస్తున్న పోప్ ఫ్రాన్సిస్ కు అమెరికాలో స్వాగతం పలికేందుకు తెలుపు రంగు కార్పెట్ ఏర్పాటు చేస్తే.. మోడీకి మాత్రం రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. మొత్తానికి ఒక భారత ప్రధాని పర్యటన సందర్భంగా అమెరికన్లు పలు జాగ్రత్తలు తీసుకోవటం.. ప్రత్యేకత ప్రదర్శించటం తాజాగా వచ్చిన మార్పుగా చెప్పక తప్పదు.