Begin typing your search above and press return to search.

జాతీయ స్థాయికి క్యాసినో వివాదం

By:  Tupaki Desk   |   25 Jan 2022 5:02 AM GMT
జాతీయ స్థాయికి క్యాసినో వివాదం
X
గుడివాడ క్యాసినో వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని టీడీపీ వ్యూహ కమిటీ డిసైడ్ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో క్యాసినో నడిపించారని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఇతర ప్రతిపక్షాలు పెద్ద రచ్చ చేస్తున్నాయి. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలోనే క్యాసినో జరిగింది కాబట్టి వెంటనే మంత్రివర్గంలో నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలను మంత్రి కొట్టిపారేస్తున్నారు.

ఈ విషయంలో మంత్రికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎంత రచ్చ చేయాలో అంతా చేస్తున్నాయి. ఇది సరిపోదన్నట్లుగా జాతీయస్థాయి దర్యాప్తు సంస్ధలకు కూడా మంత్రిపై ఫిర్యాదు చేయాలని తాజాగా తెలుగుదేశం వ్యూహ కమిటి నిర్ణయించింది. క్యాసినో వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళటం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను అందరికీ తెలిసేట్లు చేయాలన్నది టీడీపీ ఆలోచన. అయితే దీనివల్ల టీడీపీకి జరిగే మేలే ఏమిటన్నది వేరే విషయం.

గుడివాడకు పార్టీ తరపున నిజనిర్ధారణ కమిటీ వెళ్లడం, ఆ సమయంలో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవటం లాంటి ఘటనలపైన కూడా సమావేశం చర్చించింది. క్యాసినో వివాదాన్ని నిజనిర్ధారణ కమిటీ నేతలు బాగా హైలైట్ చేస్తున్నట్లు నేతలను చంద్రబాబు అభినందించారు. ఈ క్యాసినో వివాదం చివరకు ఎలా ముగుస్తుందో తెలీదుకానీ ప్రస్తుతానికైతే అధికార-ప్రతిపక్షాల నేతల మధ్య సవాళ్ళు-ప్రతిసవాళ్ళతో రాజకీయ కాలుష్యం పెరిగిపోతోంది.

టీడీపీ వ్యవహారం చూస్తుంటే క్యాసినో వివాదాన్ని ఇక్కడితో వదిలి పెట్టకూడదనే అనుకుంటున్నట్లు అనుమానంగా ఉంది. ఎందుకు తెలుగుదేశం దీనిని సీరియస్ గా తీసుకుంది అంటే... క్యాసినో అనేది దేశంలో ప్రత్యేక అనుమతి ఉన్న టూరిజం ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల నిషేధం. ఇది కేంద్రం కూడా సీరియస్ గా తీసుకునే అంశం. అందుకే చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వైసీపీ నేతను ఇరికించాలని టీడీపీ చూస్తోంది.