Begin typing your search above and press return to search.

నోట్ల క‌ట్ట‌లు విమానాల్లో తెచ్చేస్తార‌ట‌

By:  Tupaki Desk   |   19 April 2018 5:22 AM GMT
నోట్ల క‌ట్ట‌లు విమానాల్లో తెచ్చేస్తార‌ట‌
X
మిగిలిన రాష్ట్రాల‌తో పోలిస్తే నోట్ల కొర‌త తెలుగు రాష్ట్రాల్లో అంత‌కంత‌కూ పెరిగిపోవ‌టం తెలిసిందే. ఎనీ టైం మ‌నీగా ఉంటే ఏటీఎంలు.. ఎనీ టైం మూత‌గా మారిన దుస్థితి రెండు తెలుగురాష్ట్రాల్లో క‌నిపిస్తోంది. బ్యాంకు ఖాతాలో ఉన్న డ‌బ్బుల్ని తీసుకోవ‌టానికి ఏటీఎంల వ‌ద్ద‌కు వెళితే.. ప్ర‌తి ఏటీఎం ఎదుట నో క్యాష్ అన్న బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. సామాన్యులు గ‌గ్గోలు పెడుతున్నా రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు పెద్ద‌గా ప‌ట్టించుకోని ప‌రిస్థితి.

ఏమైందో ఏమో కానీ స్పందించే గుణం కాస్త ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుణ్య‌మా అని.. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో ఏటీఎంల క‌ష్టాల ముచ్చ‌ట ఆర్థిక‌మంత్రి జైట్లీ దృష్టికి వెళ్లేలా ట్వీట్ చేశారు. ఒక రాష్ట్ర మంత్రి స్పందించి ట్వీట్ చేయ‌టం.. ప్ర‌జ‌ల్లోకి ఆ విష‌యం వెళ్లిపోవ‌టంతో దిద్దుబాటు చ‌ర్య‌ల్ని మొద‌లు పెట్టింది కేంద్ర స‌ర్కార్‌.

నిన్న‌టివ‌ర‌కూ న‌గ‌దు కొర‌త‌కు కాక‌మ్మ క‌బుర్లు చెబుతూ కాలం గడిపేసిన‌ప్ప‌టికీ.. ఎప్పుడైతే సీఎం కొడుకు ట్వీట్ చేసి.. స‌మ‌స్య తీవ్ర‌త ఎంత ఉందో తెలుసా? అన్నట్లు చేసిన ట్వీట్ కు బ్యాంకులు రియాక్ట్ కావ‌టం మొద‌ల‌య్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో న‌గ‌దు కొర‌త లెక్క తేల్చేందుకు బ్యాంకులే స్వ‌యంగా రంగంలోకి దిగాయి. ప్ర‌భుత్వ‌.. ప్రైవేటు బ్యాంకులు క‌లిసి ఒక క‌మిటీగా ఏర్ప‌డి న‌గ‌దు కొర‌త అంటూ లేని మ‌హాన‌గ‌రాలైన చెన్నై.. ముంబ‌యి..కొచ్చి లాంటి సిటీస్ నుంచి సొమ్మును విమానాల్లో ప్ర‌త్యేకంగా తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు షురూ చేశారు.

అలా తీసుకొచ్చిన మొత్తాన్ని నో క్యాష్ అన్న బోర్డు లేకుండా ఏటీఎంల‌లో స‌ర్దేస్తే న‌గ‌దు కొర‌త‌ను తీర్చటంతో పాటు.. ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌ల్ని కాస్త త‌గ్గించొచ్చు అన్న ఆలోచ‌న‌లో ఉన్నాయి. ప్ర‌తి బ్యాంకు త‌మ ద‌గ్గ‌ర అందుబాటులో ఉన్న న‌గ‌దు నిల్వ‌లు ఎంత‌? ఏటీఎంలో అందుబాటులో ఉంచింది ఎంత‌న్న లెక్క‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు చెప్పాలంటూ ఏస్ బీఐ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటైన క‌మిటీ నిర్ణ‌యించింది. వివిధ న‌గ‌రాల నుంచి తీసుకొచ్చే న‌గ‌దును హైద‌రాబాద్ ఆర్ బీఐ వ‌ద్ద ఉంచి.. క్యాష్ మొత్తాన్ని అన్ని బ్యాంకుల‌కు పంచే బాధ్య‌త‌ను అప్ప‌జెప్పారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ వీకెండ్ నాటికి ఏటీఎం క‌ష్టాలు తీరే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.