Begin typing your search above and press return to search.

బాబు వాయిస్ శాంపిల్స్ తీసుకుంటారా?

By:  Tupaki Desk   |   27 Nov 2015 6:56 AM GMT
బాబు వాయిస్ శాంపిల్స్ తీసుకుంటారా?
X
రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చిచ్చు రేపిన ఓటుకు నోటు వ్య‌వ‌హారం మ‌రోసారి తెర మీద‌కు వ‌చ్చింది. ఓటుకు నోటు కేసుపై విచార‌ణ ఉధృతంగా సాగి.. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఏ నిమిషాన ఏం జ‌రుగుతుందోన‌న్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇరు ప్రాంతాల మ‌ధ్య కొత్త ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణమ‌వుతుందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏం జ‌రిగిందో కానీ.. ఉధృతంగా సాగిన విచార‌ణ ఒక్క‌సారిగా నెమ్మ‌దించింది.

గ‌త కొద్దికాలంగా స్త‌బ్దుగా ఉన్న‌ట్లు అనిపించిన ఓటుకు నోటు కేసు వ్య‌వ‌హారం తాజాగా తెర‌పైకి వ‌చ్చింది. ఆడియో టేపుల్లో గొంతును నిర్థారించుకున్న ఫోరెన్సిక్ నిపుణులు త‌మ నివేదిక‌ను ఏసీబీకీ అంద‌జేయ‌టం.. అందులోని గొంతులు స‌రైన‌వ‌ని తేల‌టం గ‌మ‌నార్హం. ఇక‌.. ఆడియో టేపుల్లో ఉన్న గొంతులలో రేవంత్‌ రెడ్డి.. సండ్ర వెంక‌ట వీర‌య్య‌.. మ‌త్త‌య్య‌ల‌వ‌ని తేల్చిన‌ట్లు తెలుస్తోంది. ఆడియో.. వీడియో టేపుల్ని ప‌రిశీలించిన అధికారులు ఇవ‌న్నీ కూడా కేసులోని నిందితుల‌విగా గుర్తించారు.

ఈ ప‌రిస్థితుల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు గొంతును చెక్ చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థిని గెలుపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్ కు రేవంత్ డ‌బ్బు ముట్ట‌చెబుతూ కెమేరా కంటికి చిక్క‌టం.. అరెస్ట్ కావ‌టం తెలిసిందే. ఈ స‌మ‌యంలోనే స్టీఫెన్ స‌న్ తో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుదిగా చెబుతున్న ఆడియో ఒకటి విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ ఆడియోలో ఉన్న గొంతు.. చంద్ర‌బాబు గొంతు ఒక‌టేనా? అన్న‌ది స‌రిపోల్చుకోవాల్సిన అవ‌స‌రం ఏసీబీపై ప‌డింది. దీంతో.. ఏపీ ముఖ్య‌మంత్రికి స్వ‌ర ప‌రీక్ష నిర్వ‌హించాల్సి ఉంటుంది. మ‌రి.. ఇది సాధ్య‌మ‌వుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

బాబు వాయిస్ శాంపిల్స్ తీసుకోవాల‌ని భావిస్తున్న టీ ఏసీబీ నిర్ణ‌యంపై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వాయిస్ శాంపిల్స్ తీసుకునే దిశ‌గా అడుగులు ప‌డ‌వ‌ని చెబుతున్నారు. అలాంటిదే జ‌రిగితే రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య స‌రికొత్త ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీస్తుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వాయిస్ శాంపిల్స్ తీసుకునే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్న‌య‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాప‌డుతున్నాయి. మ‌రి.. ఇందుకు భిన్నంగా అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటాయేమో చూడాలి.