Begin typing your search above and press return to search.

యూపీలో అంతే.. పోలీసుల ఎదుటే వార్నింగ్ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   6 Oct 2020 11:45 AM IST
యూపీలో అంతే.. పోలీసుల ఎదుటే వార్నింగ్ ఇచ్చేశారు
X
ఒకప్పుడు బిహార్ లో అంతే అన్నట్లుగా సాగే దారుణాలు ఇప్పుడు యూపీలో సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హాథ్రస్ అత్యాచార ఉదంతంలో అధికారంలో ఉన్న యోగి సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా.. పోలీసుల వైఖరిని ఎండగడుతున్నా.. వారి తీరులో మాత్రం మార్పు రావటం లేదు. బాధితురాలికి.. వారి కుటుంబానికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తాజాగా ఒక వీడియో వైరల్ గా మారింది. ఠాకూర్ల సామాజిక వర్గానికి చెందిన కొందరు పోలీసుల ఎదుటే.. భీమ్ ఆర్మీ చీఫ్ కు వార్నింగ్ ఇచ్చిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. నిందితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన చంద్రశేఖర్ అజాద్ ను పోలీసుల ముందే హెచ్చరికలు చేసినా.. ఠాకూర్ల తీరును పట్టించుకోకుండా ఉండటం ఇప్పుడు మింగుడుపడని అంశంగా మారింది. అదే సమయంలో మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చే వారికి అనుమతులు నిరాకరించారు.

గ్రామంలోనూ.. చుట్టుపక్కల ప్రాంతాల్లో 144వ సెక్షన్ విధించారు. గుంపులు.. గుంపులుగా చేరటాన్ని నిషేధించిన యోగి సర్కారు.. తాజాగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ అజాద్ తో పాటు.. ఆయనకు మద్దతుగా వెళ్లిన 400 మంది మీద కేసు నమోదు చేయటం గమనార్హం. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ఇదే భీమ్ ఆర్మీ చీఫ్ కు వార్నింగ్ ఇచ్చిన 500 మందిపైన ఎలాంటి కేసులు లేకపోవటమే కాదు.. వారికి నచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నా అడిగే నాథుడే లేకుండా పోయారు.

పోలీసుల తీరుపై భీమ్ ఆర్మీ చీఫ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిందితుల తరఫు ఎలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినా ఎలాంటి చర్యలు ఉండవు కానీ.. బాధితురాలిని పరామర్శించేందుకు వస్తే మాత్రం కేసులు పెడతారా? మృతురాలి కుటుంబానికి ప్రత్యేక భద్రత చాలా అవసరం. పోలీసులు వెంటనే కల్పించాలన్నారు. ఇదిలా ఉంటే.. ఆ గ్రామానికి చెందిన ఉన్నత కులస్తులు తాజాగా సమావేశమై.. బాధితురాలి కుటుంబం అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వరుస పరిణామాలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఇదంతా చూస్తే.. యూపీలో మరీ ఇంత దారుణమా? అన్న భావన కలుగక మానదు.