Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే కేసులే.. ఏపీ సీఐడీ వార్నింగ్

By:  Tupaki Desk   |   18 Dec 2021 1:30 AM GMT
సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే కేసులే.. ఏపీ సీఐడీ వార్నింగ్
X
సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఎవరిపై పడితే వారిపై పోస్టులు, ఫొటోలు పెడుతున్నారా? ముందూ వెనుక ఆలోచించకుండా వేరే వాళ్లవి షేర్ చేసి కించపరిచారో మీరు బుక్కైనట్టే.. బీకేర్ ఫుల్ అంటున్నారు ఏపీ సీఐడీ పోలీసులు. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాల్సి వస్తుందని ఏపీసీఐడీ హెచ్చరించింది. శిక్షలు అనుభవించాల్సి వస్తుందన్నారు.

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారికి ఏపీ సీఐడీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్టులు ఇష్టానుసారం పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వంపైనా.. సీఎం జగన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ స్పందించింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ అసత్య ప్రచారాలు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఊపేక్షించమని స్పష్టం చేసింది. మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేసినా అసత్యాలు ప్రచారం చేసినా కించపరిచేలా పోస్టులు పెట్టినా కేసులు ఫైల్ చేస్తామని హెచ్చరించింది. అంతేకాదు.. డబ్బులిచ్చి దుష్ప్రచారం చేసే వారిని ప్రోత్సహించే వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాంటి వారికి శిక్ష తప్పదని తేల్చిచెప్పింది.

డబ్బు కోసమో లేక లాభాపేక్షతోనే ప్రభుత్వాన్ని మహిళలను , గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న వారిని కించపనిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని శిక్ష తప్పదని ఏపీ సీఐడీ వెల్లడించింది. సోషల్ మీడియాలో పోస్టులను, వీడియోలను ఇతరుల వ్యాఖ్యలనుషేర్ చేసే ముందు పరిశీలన చేయాలని.. అది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలని సీఐడీ హితవు పలికింది.  ఘర్షణలు రేకెత్తించే పోస్టులకు దూరంగా ఉండాలని సూచించింది.

ఈ క్రమంలోనే టీడీపీ అనుబంధ టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా సమన్వయకర్త సంతోష్ ను సీఐడీ అధికారులు తాజాగా రాజమండ్రిలో అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ మాట్లాడిన ఓ వీడియోను సంతోష్ మార్ఫింగ్ చేశారని.. సీఎం ప్రసంగాన్ని అభ్యంతరకర రీతిలో మార్చేశారని సీఐడీ అదుపులోకి తీసుకుంది.