Begin typing your search above and press return to search.

బాబు కొత్త ఎమ్మెల్సీపై పాత కేసుల జోరు

By:  Tupaki Desk   |   4 March 2017 12:06 PM IST
బాబు కొత్త ఎమ్మెల్సీపై పాత కేసుల జోరు
X
ఏపీలో టీడీపీ ఆరు ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుని సంబంరపడిపోతున్న సమయంలోనే అలా ఏకగ్రీవంగా ఎన్నికైన నేత దీపక్ రెడ్డి ఘనకార్యాలను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టడం.. అవి టీడీపీకి అనుకూలంగా ఉండే ఈనాడు సహా అన్ని పత్రికల్లో రావడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. పెద్దల సభకు బోణీ కొట్టిన నేతకు తొలి రోజునే ఇలాంటి అనుభవం ఎదురవడంతో చంద్రబాబు పరువు బజారున పడినట్లయింది.

అనంతపురం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన జేసీ ప్రభాకర్‌ రెడ్డి అల్లుడు దీపక్‌ రెడ్డి ని ఓ భూ కబ్జా కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ఏ-5గా చేర్చారు. బంజారాహిల్స్‌లో ఆయూబ్ కమల్ అనే వ్యక్తి తన మూడు ఎకరాలు 37సెంట్ల భూమిని గతంలో ఎంవీఎస్ చౌదరి అనే వ్యక్తికి 1960లోనే విక్రయించారని.. అయితే జై హనుమాన్ ట్రేడర్స్ యాజమానితో పాటు దీపక్ రెడ్డి కలిసి ఆ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించారని పోలీసులు చెబుతున్నారు.

ఆ భూమిని ఆయూబ్ కమల్ తొలుత తమకే విక్రయించారంటూ కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎంవీఎస్‌ చౌదరి తరపు న్యాయవాదులు అసలు పత్రాలను కోర్టు ముందు ఉంచారు. దీంతో సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. జై హనుమాన్‌ ట్రేడర్స్ - దీపక్‌ రెడ్డి తప్పుడు పత్రాలు సృష్టించినట్టు తేల్చారు. దీంతో జైహనుమాన్ ట్రేడర్స్ యజమాని కుమారుడు సక్సేనా - దీపక్‌ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధ‌మైంది. జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్‌ రెడ్డిపై ఇంకా అనేక భూకబ్జా కేసులు కూడా ఉన్నాయంటున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు దీపక్‌ రెడ్డి ఏకంగా తన ఆస్తుల విలువను 6,781 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్‌ లోనే చూపించారు. అయితే.. ఆ ఆస్తుల్లో చాలావరకు వివాదాల్లో ఉన్న భూములేనట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/