Begin typing your search above and press return to search.

ఐస్ ఫ్రూట్ పేరుతో ఇదేం ప‌ని కంభంపాటి?

By:  Tupaki Desk   |   17 July 2018 5:11 AM GMT
ఐస్ ఫ్రూట్ పేరుతో ఇదేం ప‌ని కంభంపాటి?
X
ఏమైనా స‌రే.. తెలుగు త‌మ్ముళ్లు తెలుగు త‌మ్ముళ్లే. వారి తెలివితేట‌లు చూస్తే షాక్ తినాల్సిందే. ఇలాంటి గొప్ప ఐడియాలు వారికి మాత్ర‌మే వ‌స్తాయేమో. తాజాగా అలాంటి తెలివినే ప్ర‌ద‌ర్శించిన తెలుగుదేశం ఎంపీ (రాజ్య‌స‌భ) కంభంపాటి రామ్మోహ‌న్ రావుపై బంజారాహిల్స్ లో తాజాగా కేసు న‌మోదైంది.

వ్యాపారం చేయ‌టం త‌ప్పే కాదు.. కానీ.. కంభంపాటి మాదిరి చేయ‌కూడ‌ద‌న్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. కంభంపాటి నేత‌గా సుప‌రిచితుడు కానీ.. ఆయ‌న పెద్ద ఆటోమోటివ్స్ ఛైన్ సంస్థ‌కు అధిప‌తి అన్న విష‌యం సామాన్యుల‌కు పెద్ద‌గా తెలీని విష‌యం. శ్రీ‌జ‌య‌ల‌క్ష్మి ఆటోమోటివ్స్ కు ఎండీగా వ్య‌వ‌హ‌రించే కంభంపాటి.. నివాసిత ప్రాంతం (రెసిడెన్సీ)లో ఎలాంటి అనుమ‌తులు లేకుండా కార్ల స‌ర్వీస్ సెంట‌ర్ ను ఏర్పాటు చేయ‌టంపై తాజాగా పోలీసుల‌కు ఫిర్యాదు అందింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. బంజారాహిల్స్ రోడ్ నెంబ 14లోని భాగ్య‌న‌గ‌ర్ స్టూడియోస్ ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన శ్రీ‌జ‌య‌ల‌క్ష్మి ఆటోమోటివ్స్ వ్యాపారానికి.. ఐస్ ఫ్రూట్ ఫ్యాక్ట‌రీ అండ్ మిషిన్ పేరుతో జీహెచ్ ఎంపీ నుంచి అనుమ‌తులు తీసుకున్నారు. ఐస్ ఫ్రూట్ వ్యాపారానికి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని.. ఆ ప్లేస్ లో ల‌క్ష్మీ హుంద‌య్ పేరుతో కార్ షెడ్.. వ‌ర్క్ షాప్.. స‌ర్వీస్ సెంట‌ర్ ను న‌డిపిస్తున్న వైనంపై తాజాగా అక్క‌డి స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

కార్ల‌కు డెంటింగ్‌.. పెయింటింగ్ తో పాటు ఇత‌ర మిష‌న‌రీ ప‌నుల‌తో వాయు.. శ‌బ్ద కాలుష్యంతో తామంతా ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లుగా అక్క‌డి వారు వాపోతున్నారు. నివాసిత ప్రాంతంలో ఈ సంస్థ‌ను ఏర్పాటు చేయ‌టంతో వృద్ధులు.. బ్రాంకైటిస్.. ఆస్త‌మా వ్యాధుల‌కు గురి అవుతున్న‌ట్లుగా ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థ‌లాన్ని వినియోగిస్తూ.. రోడ్డు ప‌క్క‌న అక్ర‌మ పార్కింగ్ లు చేస్తున్నార‌ని.. ఇదే ప్రాంతంలో డీఏవీ స్కూల్ ఉండ‌టంతో త‌ర‌చూ కార్ల రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు త‌మ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఐస్ ఫ్రూట్ ఫ్యాక్ట‌రీ పేరుతో ట్రేడ్ లైసెన్స్ ఉన్న చోట ఆయ‌న కారు షెడ్‌.. స‌ర్వీస్ సెంట‌ర్‌ కు ఎలాంటి ప‌న్ను చెల్లించ‌టం లేద‌ని.. ఈ కార‌ణంగా ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీగా న‌ష్టం వాటిల్లుతోంద‌ని అధికారులు చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆందోళ‌న క‌లిగించే మ‌రో అంశం ఏమిటంటే.. ఇక్క‌డి గౌడ‌న్ లో 40 వ‌ర‌కు ఇంజిన్ ఆయిల్ డ్ర‌మ్ములు నిల్వ చేయ‌టంతోపాటు పెద్ద ఎత్తున సామాగ్రిని నింపేయ‌టంతో ఏదైనా అనుకోని ప్ర‌మాదం జ‌రిగితే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌న్న ఆందోళ‌న‌లో స్థానికులు ఉన్నారు. మ‌రి.. దీనిపై స‌ద‌రు ఎంపీగారు ఏమ‌ని సెల‌విస్తారో..?