Begin typing your search above and press return to search.

గంగవరం పోర్టు అమ్మకంపై కోర్టులో కేసు

By:  Tupaki Desk   |   11 Sept 2021 7:01 PM IST
గంగవరం పోర్టు అమ్మకంపై కోర్టులో కేసు
X
గంగవరం పోర్టు లిమిటెడ్ లో రాష్ట్రప్రభుత్వం తన వాటాను వదులుకోవటంపై కోర్టులో పిటీషన్ దాఖలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు లాయర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలను అనేకమంది కోర్టుల్లో చాలెంజ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకోవటం ఆలస్యం వెంటనే ఎవరో ఒకరు కోర్టుల్లో సదరు నిర్ణయాలను చాలెంజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను అదానీ గ్రూపుకు అమ్మేయాలన్న నిర్ణయంపై కేస పడింది.

పోర్టులో తన వాటాను అమ్మేసుకోవటం ద్వారా ప్రభుత్వానికి రు. 644.78 కోట్లు వస్తుంది. ప్రభుత్వం వాటాను కూడా కొనుగోలు చేసేస్తే అదానీ గ్రూపుకు పోర్టుపై నూరుశాతం యాజమాన్యం హక్కులు వచ్చేస్తాయి. ప్రభుత్వం తన వాటాను అమ్మేసుకునే విషయంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్)తో చాలా లోతుగా విచారణ జరిపించాలని పిటీషనర్లు కోరారు. అలాగే వాటాను అమ్ముకోవటంలో జరిగిన కుంభకోణంపై లోకాయుక్తాతో విచారణ జరిపించాలని కూడా లాయర్లు కోరారు.

ఇదే విషయమై అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం మాట్లాడుతు హైపవర్ కమిటి అన్నీ విషయాలను పరిగణలోకి తీసుకుని చేసిన సిఫారసు ఆధారంగానే ప్రభుత్వం పోర్టులో తన వాటాను వదులుకోవాలని అని నిర్ణయించినట్లు చెప్పారు. పోర్టులో వాటాను వదులుకోవాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైవర్ కమిటి సిఫారసులు మాత్రమే కారణమన్నారు. వాటా విషయంలో జరిగిన విషయాన్ని నివేదిక రూపంలో అందించేందుకు కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ కోరారు. అందుకనే తదుపరి విచారణను కోర్టు ఈనెల 20కు వాయిదా వేసింది.