Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై కేసు నమోదు

By:  Tupaki Desk   |   18 Sep 2021 7:38 AM GMT
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై కేసు నమోదు
X
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై గుంటూరు జిల్లా నకరికల్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కండ్లకుంటలో జరిగిన కోడెల వర్ధంతి సభలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ సర్పంచ్, వైకాపా నేత కంఠంనేని కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, ఐపీఎస్ అధికారులను కించపరిచేలా అయ్యన్నపాత్రుడు మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసింది. ఆ వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వైసీపీ నేతలను మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో పాటు పలువురు నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ దశలో జోగి రమేష్- బుద్ధా వెంకన్న మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలను అదుపుచేసి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. ఈ వ్యవహారం ఇరుపార్టీల నేతలు ఘర్షణకు దిగేలా చేసింది. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు అయ్యన్న కౌంటర్ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించలేదని స్పష్టం చేశారు. చర్చిలో ఫాదర్ మాదిరిగా ఓ మై సన్ అని మాత్రమే సంబోధించానని తనదైన స్టైల్లో వివరణ ఇచ్చారు. ప్రస్తుతం కేబినెట్లో మంత్రులు మాట్లాడుతున్న మాటలనే చెప్పాను తప్ప హద్దులు దాటలేదన్నారు.

మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలుద దాడికి యత్నించడం సరికాదన్నారు. ప్రతిపక్ష నేత ఇంటి మీద దాడి చేయడం పద్ధతికాదన్న ఆయన.. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడుతున్న మాటలే చెప్పాను తప్ప ముఖ్యమంత్రిని తిట్టలేదని, తన మాటల్లో తిట్లు ఎక్కడున్నాయో చూపాలని అయ్యన్న వైసీపీకి సవాల్ విసిరారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం దగ్గర జరిగిన ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించాడు. సీఎం జగన్ రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా మార్చేశారని మండిపడ్డారు. జోగి రమేష్ ఎమ్మెల్యేనా, లేక రౌడీనా అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.