Begin typing your search above and press return to search.

మైనింగ్ తమ్ముడి మీద కేసు పెట్టటానికి ఐదేళ్లు పోరాడాలా?

By:  Tupaki Desk   |   3 Aug 2019 12:06 PM GMT
మైనింగ్ తమ్ముడి మీద కేసు పెట్టటానికి ఐదేళ్లు పోరాడాలా?
X
చేతిలో అధికారం ఉంటే చాలు వ్యవస్థల్ని బొమ్మలుగా వాడేసే వైనం నేతల్లో కనిపించేదే. ఐదేళ్ల బాబు పాలనలో తమ పార్టీ నేతల్ని ఎంత ఇష్టారాజ్యంగా వదిలేశారన్న దానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. నిజానికి ఈ తీరు కూడా ఆయన దారుణ ఓటమికి కారణం. తప్పు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవటంలో ఉదాసీనత ప్రదర్శించటమే కాదు.. ఎంతకైనా వారిని రక్షించే తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకు నిదర్శనంగా గుంటూరు జిల్లా తెలుగు తమ్ముడి ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు.

గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో మైనింగ్ ఎక్కువ. తమకున్న అధికారాన్ని ఉపయోగించి నాటి గురజాల ఎమ్మెల్యే.. నేడు మాజీ అయిన యరపతినేని శ్రీనివాసరావు ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ నేతలపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టనట్లుగా వ్యవహరించే చంద్రబాబు.. యరపతినేని విషయంలోనూ అదే తీరును ప్రదర్శించారు. యరపతినేని అక్రమ మైనింగ్ పై పిడుగురాళ్లకు చెందిన గురవాచారి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో తాజాగా ఆయనపై కేసు నమోదు చేశారు. అక్రమ మైనింగ్ పై తాను 2014లోనే ఫిర్యాదు చేశానని.. అప్పటి మైనింగ్ అధికారులు కానీ.. పోలీసుల కానీ పట్టించుకోలేదన్నారు. తాజాగా కోర్టు పుణ్యమా అని తెలుగు తమ్ముడిపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపితే విస్మయకర అంశాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.