Begin typing your search above and press return to search.

భాగ్యనగరిలో ఘోరం..ఆశ్రమంలో వృద్ధులపై చిత్రహింసలు

By:  Tupaki Desk   |   24 Jan 2020 11:18 AM GMT
భాగ్యనగరిలో ఘోరం..ఆశ్రమంలో వృద్ధులపై చిత్రహింసలు
X
భాగ్యనగరిలో మరో ఘోరం వెలుగు చూసింది. మానసిక రోగాలతో బాధపడుతున్న వృద్ధులకు వైద్యం చేయిస్తామని చెబుతూ ఓ ఆశ్రమాన్ని తెరచిన కొందరు దుర్మార్గులు... వైద్య చికిత్సల పేరిట వృద్ధులను చిత్రహింసలకు గురి చేస్తున్న వైపం కలకలం రేపుతోంది. చిత్రహింసలంటే... ఏదొో ఆషామాషీగా కాకుండా కదిలేందుకు కూడా వీలు లేకుండా వృద్ధులను గొలుసులతో కట్టేసి శరీరంపై వాతలు తేలేలా కొడుతున్న సదరు ఆశ్రమ నిర్వాహకులపై స్థానికులు ఫిర్యాదు చేయగా... రంగంలోకి దిగిన పోలీసులు సదరు ఆశ్రమంపై దాడులు చేసి అక్కడ దాదాపుగా బందీలుగా మారిపోయిన వృద్ధులకు విముక్తి కల్పించారు. ఆ తర్వాత బాధితులను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు... ఆశ్రమం సాగిస్తున్న దురాగతాలపై దర్యాప్తు ప్రారంభించారు.

పెను కలకలం రేపుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగర శివారు నాగారంలో శిల్పానగర్‌లో వృద్ధాశ్రమం పేరుతో నిర్వహిస్తున్న ఓ రిహాబిలిటేషన్ కేంద్రంలో వయసు పైబడిన వారిని చిత్ర హింసలకు గురి చేస్తున్నారట. ఓ సంస్థ వృద్ధాశ్రమం పేరుతో అక్రమంగా ఈ మానసిక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకే గదిలో 50 మందికిపైగా వృద్ధులను ఉంచుతూ.. వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై తొలి నుంచి అనుమానాలున్నా.. ఇటీవల నిర్వాహకుల దారుణాలు మరింత పెరిగిపోగా... స్థానికులు 100 నెంబరుకు ఫోన్ చేసి, పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిపోయిన పోలీసులు పునరావాస కేంద్రంపై దాడి చేశారు. ఆశ్రమంలో ఉన్న బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మానసిక సమస్యలతో బాధపడుతున్న వయసు పైబడిన వారికి ఆరోగ్యం బాగు చేస్తామంటూ నిర్వాహకులు ఈ ఆశ్రమం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు గానూ వృద్ధాశ్రమ నిర్వాహకులు బాధిత కుటుంబాల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేంద్రంలో 21 మంది మహిళలు, 53 మంది పురుషులు ఉన్నట్లు సమాచారం. చికిత్స చేస్తున్నామనే పేరుతో బాధితులను గొలుసులతో కట్టేసి, వారికి నరకయాతన చూపిస్తున్నట్లు తెలిసింది.

వృద్ధాశ్రమం పేరుతో పునరావాస కేంద్రం నిర్వహిస్తున్న ఆశ్రమ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఇంట్లో వృద్ధులతోపాటు కొంత మంది యువకులు కూడా ఉండడం గమనార్హం. దీనికి సంబంధించి స్థానికులు చిత్రీకరించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బయటి ప్రపంచానికి ఇందులో మనుషులు ఉన్నట్లు ఏమాత్రం తెలీదని, ఒక గదిలో 50 మందికి పైగా ఉంచి హింసిస్తున్నారని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. వీరికి వివిధ రకాల మానసిక సమస్యలు ఉన్నాయని, కానీ.. వారికి ఎలాంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని వివరించారు. అంతమందికి ఒకే బాత్రూం వసతితో పాటు, నాసి రకం ఆహారం ఇచ్చి ఇబ్బందుల పాలు చేస్తున్నారని చెప్పారు.