Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేపై కేసు..పీఎస్ ఎదుట ఎమ్మెల్యే ధర్నా

By:  Tupaki Desk   |   11 April 2020 6:15 PM IST
వైసీపీ ఎమ్మెల్యేపై కేసు..పీఎస్ ఎదుట ఎమ్మెల్యే ధర్నా
X
ఒక వైపు ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. లాక్ డౌన్ నిబంధనలు అమలుకు అధికారులు - పోలీసులు కట్టుదిట్టంగా పనిచేస్తున్నారు. సామాజిక దూరం పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

అయితే ఏపీలో ప్రజాప్రతినిధుల వ్యవహారశైలితో పోలీసులు - అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో సామాజిక దూరం పాటించకుండా హల్ చల్ చేసిన ఎమ్మెల్యే తీరుతో విసుగుచెందిన పోలీసులు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే కేసు నమోదు చేయడం దుమారం రేపింది. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూరగాయలు పంపిణీ చేశారు. అయితే అందులో సామాజిక దూరం పాటించకపోవడం వివాదానికి దారితీసింది. జనాలు పెద్ద ఎత్తున గుమి గూడడం.. ఎమ్మెల్యే సైతం ఆంక్షలు - నిబంధనలు - సామాజిక దూరం పాటించకుండా పంపిణీ చేశారు.

దీంతో పోలీసులు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లోనే కలకలం రేపింది.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తన అనుచరవర్గంతో పోలీస్ స్టేషన్ కు తరలివచ్చి తనపై కేసులు ఎందుకు పెట్టారో చెప్పాలంటూ స్టేషన్ వరండాలో బైటాయించి ఆందోళన చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. కేసులు కొట్టివేసే వరకూ కదిలేది లేదంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే బైటాయించారు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. కేసు ఎత్తివేయకపోతే రాజీనామాకైనా సిద్ధమని ఎమ్మెల్యే బైటాయించడంతో పోలీస్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.

కాగా సామాజిక దూరం పాటించకపోవడం.. నిబంధనలు ఉల్లంఘించడం.. 144 సెక్షన్ ఆంక్షల ఉల్లంఘన కారణంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.